Share News

పెళ్లింట విషాదం

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:12 AM

మండలంలోని గాంధీనగరంలో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులకు శుభలేఖలు ఇచ్చి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువు నాయనమ్మ మృత్యువాతపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

పెళ్లింట విషాదం
సంఘటన స్థలంలో గాయపడిన గౌరమ్మ, శంకర్‌. ఆస్పత్రికి తరలిస్తుండగా గౌరమ్మ మృతిచెందింది.

శుభలేఖలు ఇచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదం

కాబోయే వధువు నాయనమ్మ మృతి, తండ్రికి తీవ్రగాయాలు

నాతవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గాంధీనగరంలో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులకు శుభలేఖలు ఇచ్చి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువు నాయనమ్మ మృత్యువాతపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. గాంధీనగరం గ్రామానికి చెందిన చిట్లూరి శంకర్‌ కుమార్తె వివాహం మే మొదటి వారంలో చేయడానికి నిశ్చమమైంది. బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి తన తల్లి గౌరమ్మ (80)తో కలిసి మంగళవారం బైక్‌ మీద గాజువాక వెళ్లారు. రాత్రికి అక్కడే వుండి, బంధువులకు శుభలేఖలు ఇవ్వడం పూర్తయిన తరువాత బుధవారం సాయంత్రం తిరుగుముఖం పట్టారు. మండలంలోని డి.యర్రవరం- తాండవ జంక్షన్‌ మధ్య పంది అడ్డుగా రావడంతో బైక్‌ అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆటోలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అందోళనకరంగా ఉండడంతో కేజీహెచ్‌కి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. అంబులెన్స్‌లో విశాఖ తరలిస్తుండగా తాళ్లపాలెం కూడలి వద్దకు వెళ్లే సరికి గౌరమ్మ మృతిచెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

కొయ్యూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కళాశాలకు ఎందుకు వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్‌ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలో కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామానికి చెందిన లోతా దినేశ్‌ కార్తీక్‌ (16) జీకే వీధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. పరీక్షా ఫలితాలు కూడా రావడంతో రెండో సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తన నాగలక్ష్మి అనారోగ్యానికి గురవడంతో ఈ నెల 16వ తేదీన ఇంటికి వచ్చాడు. ఆమె ఆరోగ్యం కుదుటపడినప్పటికీ కార్తీక్‌ తిరిగి కళాశాలకు వెళ్లలేదు. దీంతో బుధవారం ఉదయం తండ్రి రామరాజు మందలించాడు. మనస్తాపం చెందిన కార్తీక్‌.. మధ్యాహ్నం ఇంటి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కిటికీలో నుంచి చూసిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి, కార్తీకును కిందకు దించారు. చికిత్స నిమిత్తం కృష్ణాదేవిపేట పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా వుండడంతో వైద్యుల సూచన మేరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గురువారం చుట్టుబంద గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

గాంధీనగరంలో చోరీ

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గాంధీనగరం మొదటివీధిలో బుధవారం రాత్రి చోరీ జరిగిందని పట్టణ ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గాంధీనగరం మొదటివీధిలో యర్రంశెట్టి గంగమ్మ కుటుంబసభ్యులతో నివాసముంటోంది. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఆమె కుమారుడు శివ తన భార్యతో కలిసి రామాపురంలోని అత్తవారింటికి వెళ్లాడు. బుధవారం రాత్రి కరెంట్‌ పోవడంతో గంగమ్మ తన సోదరుడు ఏఎంసీకాలనీలో ఉంటున్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా హాల్‌లో, బెడ్‌రూములో ఉన్న బీరువాలు తెరిచి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించింది. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారమందించారు. క్లూస్‌ టీమ్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నిందితుడు వేలిముద్రలు దొరక్కుండా గ్లౌజులు వాడాడని, చోరీ చేసిన తరువాత ఒక గ్లౌజ్‌ను అక్కడే విడిచి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. నాలుగుంపావు బంగారు వస్తువులు, 40 తులాల వెండి వస్తువులు, మూడు లక్షల 75వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్టు బాధితురాలు గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్‌తో కలిసి పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు.

పిసినికాడలో చోరీ

కొత్తూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీలో ఒక ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపిన వివరాలివి. బుధవారం రాత్రి పిసినికాడ గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉక్కపోతకు ఉండలేక మాధవరావు కుటుంబ సభ్యులతో కలిసి పక్కనే ఉన్న మరొకరి ఇంట్లో నిద్రించారు. ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి 5 తులాల బంగారం అపహరణకు గురైందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

రైలు నుంచి జారి పడి ఒకరికి తీవ్ర గాయాలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : స్థానిక శారదా నది రైల్వే వంతెన వద్ద బుధవారం రాత్రి రైలు నుంచి జారి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన వెంకటేశ్‌ రైలులో విజయనగరం బయలుదేరాడు. తలుపు పక్కన కూర్చున్న అతను సెల్‌ మోగడంతో పైకి లేచే ప్రయత్నంలో బూట్లు జారడంతో ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారి తుప్పల్లో పడిపోయాడు. తోటి ప్రయాణికులు అనకాపల్లి స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు సమాచారమివ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు.

మూడు లారీలకు రూ.2.3 లక్షల జరిమానా

నక్కపల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద టోల్‌ఫీజు కట్టకుండా అడ్డదారిలో వెళుతున్న మూడు టిప్పర్‌ లారీలకు అధికారులు భారీ జరిమానా విధించారు. నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఉపమాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ కొత్తరోడ్డులో ఫ్లైయాష్‌ లోడుతో వెళుతున్న రెండు టిప్పర్‌ లారీలను, గురువారం ఉదయం ఒక లారీని పట్టుకున్నారు. వీటిని ఆర్‌టీవోకు అప్పగించగా ఒక లారీకి రూ.82 వేలు, మరో లారీకి రూ.84వేలు, ఇంకో లారీకి రూ.64 వేలు చొప్పున మొత్తం రూ.2.3 లక్షల జరిమానా విధించినట్టు సీఐ తెలిపారు. టోల్‌ప్లాజా ఫీజు ఎగ్గొట్టి వక్రమార్గంలో లారీలు వెళితే పట్టుకుని కేసులు నమోదు చేస్తామని సీఐ మురళి హెచ్చరించారు.

Updated Date - Apr 24 , 2026 | 01:12 AM