ప్రభుత్వ భూమిలో కల్యాణ మండపం
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:14 AM
పెందుర్తి, గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో మంగళవారం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో కొన్ని భవనాలను తనిఖీ చేశారు.
నివాసానికి అనుమతి తీసుకుని ఆస్పత్రి నిర్వహణ
గ్రూపు హౌస్‌కు ప్లాన్...అపార్టుమెంట్ నిర్మాణం
ఏసీబీ అధికారుల తనిఖీల్లో బట్టబయలు
మూడు జోనల్ కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో సేకరించిన
సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన
అక్రమాలకు జీవీఎంసీ అధికారుల సహకారం
ప్రభుత్వానికి నివేదిక
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి, గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో మంగళవారం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో కొన్ని భవనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనేక అవకతవకలు బయటపడ్డాయి.
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పెందుర్తి జోన్ పరిధిలో ఐదు భవనాలను పరిశీలించారు. చినముషిడివాడ వుడా కాలనీ రోడ్డులో ప్రభుత్వ భూమిలో ‘స్వయంవర ఫంక్షన్ హాల్’ పేరుతో ఒకరు కల్యాణ మండపాన్ని నిర్మించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్కడ కల్యాణ మండపం నిర్మాణానికి ఒకరు ప్లాన్ కోసం దరఖాస్తు చేస్తే అధికారులు ప్రభుత్వ భూమి అనే విషయం కూడా పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణంపై ఒకరు జీవీఎంసీ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేయగా, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి ఆ స్థలం ప్రభుత్వానిదా?, ప్రైవేటుదా?...తేల్చాలని లేఖ రాయగా, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారిస్తూ రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాణం తొలగించాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ పని చేయడంలో తాత్సారం చేయడంతో సదరు ప్రైవేటు వ్యక్తి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, దాంతో కల్యాణ మండపం అలాగే కొనసాగుతోందని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అదేవిధంగా గోపాలపట్నంలో రెసిడెన్షియల్ నిర్మాణం కోసం ప్లాన్ తీసుకుని బెహరా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆ భవనాన్ని పరిశీలించిన ఏసీబీ అధికారులు అదనంగా మరో అంతస్థు నిర్మించినా టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోలేదని గుర్తించారు. అలాగే గోపాలపట్నం ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఒకరు గ్రూప్ హౌస్ నిర్మాణానికి ప్లాన్ తీసుకుని ఏకంగా అపార్టుమెంట్ నిర్మించేసినట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలో తేలింది. ఇవికాకుండా పెందుర్తి జోన్ పరిధిలోనే మరో రెండు భవనాలను ఏసీబీ అధికారులు స్వయంగా పరిశీలించి కొన్ని అక్రమాలను గుర్తించినట్టు సమాచారం. గాజువాక జోన్‌లో సీఐలు సుప్రియ, తవిటినాయుడు బృందం, మధురవాడ జోన్‌లో సీఐలు వెంకటరావు, లక్ష్మణరావు బృందం కూడా మంగళవారం సోదాల సమయంలో గుర్తించిన కొన్ని ఫైళ్లు ఆధారంగా మూడేసి భవనాలను పరిశీలించారు. వాటిల్లో కూడా ఉల్లంఘనలు జరిగినా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని అధికారుల పరిశీలనలో తేలినట్టు తెలిసింది. వీటన్నింటిపైనా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.