Share News

వెబ్‌‘ల్యాండ్‌’ హుష్‌కాకి!

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:20 AM

వారు నివాసం వుంటున్న గ్రామం ఒకటైతే.. వారి వ్యవసాయ భూములు మరో గ్రామం పరిధిలో వున్నాయి. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారో.. లేకపోతే పొరపాటున చేశారో తెలియదుగానీ.. వారసత్వంగా సాగు చేసుకుంటున్న ఈ భూములను ఆరేళ్ల క్రితం వెబ్‌ల్యాండ్‌లో నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఒకింత ఆలస్యంగా గ్రహించిన రైతులు.. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇంతవరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేలేదు. దీనివల్ల ఆయా రైతులు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన సాయం, బ్యాంకుల నుంచి పంట రుణాలు, సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ పనిముట్లు పొందలేకపోతున్నారు.

వెబ్‌‘ల్యాండ్‌’ హుష్‌కాకి!
మాకవరపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పట్టాదారు పాసుపుస్తకాలతో అందోళన చేస్తున్న జంగాలపల్లి రైతులు (ఫైల్‌ ఫొటో)

ఆరేళ్ల క్రితం 600 ఎకరాల జిరాయితీ భూములు ఆన్‌లైన్‌లో తొలగింపు

రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైతులు

అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన

ప్రభుత్వం నుంచి అందని పెట్టుబడి సాయం, రాయితీలు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

అయినా పరిష్కారంకాని సమస్య

స్పీకర్‌ అయ్యన్న దృష్టికి రావడడంతో సర్వే చేయాలని తహశీల్దారుకు ఆదేశం

గడువుదాటినా... కదలని అధికారులు

మాకవరపాలెం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వారు నివాసం వుంటున్న గ్రామం ఒకటైతే.. వారి వ్యవసాయ భూములు మరో గ్రామం పరిధిలో వున్నాయి. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారో.. లేకపోతే పొరపాటున చేశారో తెలియదుగానీ.. వారసత్వంగా సాగు చేసుకుంటున్న ఈ భూములను ఆరేళ్ల క్రితం వెబ్‌ల్యాండ్‌లో నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఒకింత ఆలస్యంగా గ్రహించిన రైతులు.. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇంతవరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేలేదు. దీనివల్ల ఆయా రైతులు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన సాయం, బ్యాంకుల నుంచి పంట రుణాలు, సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ పనిముట్లు పొందలేకపోతున్నారు.

మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన సుమారు 400 మంది రైతులకు పక్కనే ఉన్న జి.కోడూరు గ్రామంలో దాదాపు 600 ఎకరాల జిరాయితీ భూములు వున్నాయి. ఈ భూములు ఆయా రైతులకు వారసత్వంగా వచ్చాయి. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వున్నాయి. అయితే 2019 డిసెంబరులో ఆయా సర్వే నంబర్లలో వున్న అన్ని భూములు వెబ్‌ల్యాడ్‌లో అదృశ్యమయ్యాయి. కొద్ది రోజుల తరువాత ఈ విషయాన్ని గ్రహించిన రైతులు, రెవెన్యూ అధికారులను కలిసి అడిగారు. గ్రామం జి.కోడూరులోని అన్ని భూములను సర్వే చేసిన అనంతరం వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తామని చెప్పారు. నెలలు, సంవత్సరాలు గడిచినా.. ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. పది, పదిహేను మంది రైతులు మాత్రం రెవెన్యూ కార్యాలయంలో ముడుపులు చెల్లించి, తమ ‘పని’ చేయించుకున్నారు. ఎంత లంచం ఇచ్చారని మిగిలిన రైతులు అడగ్గా.. ఎకరాకు రూ.20-30 వేల వరకు సమర్పించుకున్నట్టు ఆయా రైతులు చెప్పారు. అయితే తాము అంత ఇచ్చేకోలేమని, అయినప్పటికీ పత్రాలన్నీ సక్రమంగా వున్న తమ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి లంచాలు ఎందుకు ఇవ్వాలని మిగిలిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో వున్నంత కాలం రైతుల గోడును అటు ప్రజాప్రతినిధులు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెవెన్యూ అధికారులను మరోసారి కలిసి విజ్ఞప్తిచేశారు. కానీ ఫలితం లేకపోవడంతో సుమారు ఎనిమిది నెలల క్రితం రైతులంతా కలిసి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేశారు. తరువాత స్థానిక ఎమ్మెల్యే అయిన శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆయన రెవెన్యూ అధికారులతో మాట్లాడి, జి.కోడూరులో సర్వే చేయించి, ఆయా రైతుల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. డిసెంబరులోగా సర్వే చేయిస్తానని తహశీల్దారు చెప్పారు. జనవరి రెండో వారం వచ్చినప్పటికీ జి.కోడూరులో భూముల సర్వే జరగలేదు. మండలంలోని ఇతర గ్రామాల్లో భూముల సర్వే నిర్వహిస్తున్న అధికారులు.. జి.కోడూరులో ఎందుకు చేయడం లేదని ఆయా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల నుంచి తమ భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడం వల్ల ప్రభుత్వ పరంగా రైతు భరోసా/ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ యోజన, బ్యాంకుల నుంచి పంట రుణాలు, రాయితీపై వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమ వద్ద పాత పట్టాదారు పాసుపుస్తకాలు వున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తమ భూములను వెబ్‌ల్యాండ్‌లో ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కాగా రైతుల ఆవేదనపై తహశీల్దారు బి.వెంకట రమణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. వచ్చే విడత భూ సర్వే చేసే గ్రామాల్లో జి.కోడూరును చేరుస్తామని బదులిచ్చారు.

Updated Date - Jan 12 , 2026 | 12:20 AM