హెల్మెట్ ధారణ తప్పనిసరి
ABN , Publish Date - May 05 , 2026 | 11:32 PM
ప్రాణం ఎంతో విలువైనదని, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ
హోం మంత్రి అనిత
హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీ
ఎస్.రాయవరం, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రాణం ఎంతో విలువైనదని, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని సూచించారు. ‘సురక్షిత రోడ్లు- సురక్షిత జీవితం, మీ భద్రత- మా బాధ్యత’ అనే నినాదంతో హెల్మెట్ ధారణపై మంగళవారం మండలంలోని అడ్డరోడ్డు జంక్షన్ నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంత్రి అనిత హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు. అంతకుముందు అడ్డరోడ్డు జంక్షన్‌లో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, లక్షల రూపాయలు వెచ్చింది ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు.. కేవలం వెయ్యి రూపాయల ఖరీదు చేసే హెల్మెట్ కొనడానికి వెనుకాడుతుండడంతో శోచనీయమని అన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, రాజకీయ నాయకులు హెల్మెట్‌లు లేకుండా వాహనాలు నడుపుతూ కనిపిస్తే.. వారికి రెట్టింపు జరిమానా విధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్ మోహన్‌రావు, సీఐలు రామకృష్ణ, శంకరరావు, మురళీ, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, కూటమి నేతలు శివదత్తు, అమలకంటి అబద్దం, యేజెర్ల వినోద్‌రాజు, ఎన్.వెంకటరాజు, గుర్రం రామకృష్ణ, భీమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.