పక్కదారి పట్టిన రూ.63 కోట్లు తిరిగి రాబడతాం
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:52 PM
గత వైసీసీ ప్రభుత్వ హయాంలో బినామీ పేర్లతో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రుణాల పేరిట రూ.63 కోట్లు పక్కదారి పట్టించారని, వాటిని తిరిగి కక్కిస్తామని డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో బినామీ పేర్లతో రుణాలు
తిరిగి వసూలు చేసేందుకు చర్యలు
డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు
రావికమతం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీసీ ప్రభుత్వ హయాంలో బినామీ పేర్లతో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రుణాల పేరిట రూ.63 కోట్లు పక్కదారి పట్టించారని, వాటిని తిరిగి కక్కిస్తామని డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. శుక్రవారం చినపాచిల, రావికమతం సహకార సంఘాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే బినామీ పేర్లతో రుణాలు పొందిన వారిని గుర్తించామన్నారు. చట్ట ప్రకారం వీరి నుంచి తిరిగి వసూలు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. సహకార సంఘాలు పటిష్ఠంగా ఉంటేనే రైతులకు సులువుగా వ్యవసాయ రుణాలు అందేందుకు సాధ్యమవుతుందన్నారు. సహకార సంఘాల్లో అవకతవకలను నిరోధించేందుకు జిల్లాలో 98 ప్రాథమిక సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేశామన్నారు. జిల్లాలో సొంత భవనాలు లేని 46 ప్రాథమిక సంఘాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. డ్వాక్రా గ్రూపులకు వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఒక్కొక్క గ్రూపునకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని డీసీసీబీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 33 బ్రాంచీలుండగా, మరో మూడు కొత్త బ్రాంచీల ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంకును అనుమతి కోరామని ఆయన తెలిపారు.