అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించను
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:16 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ టి.నిషాంతి స్పష్టీకరణ
పీజీఆర్‌ఎస్‌లో 104 వినతులు స్వీకరణ
పాడేరురూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి స్పష్టం చేశారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ అర్జీని పరిశీలించి, సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. ప్రతి సోమవారం మండల పీజీఆర్‌ఎస్‌కు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. విధులకు హాజరు కాకుంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండల స్థాయిలోనే అర్జీలను పరిష్కరిస్తే జిల్లా స్థాయికి వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ 104 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, పంచాయతీ ఇంజనీరింగ్ శాఖకు 14, విద్యా శాఖకు 8 అర్జీలతో పాటు గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్, ఎస్‌ఎంఐ, ఆర్‌వోఎఫ్‌ఆర్, పెన్షన్‌లు, రోడ్లు, భవనాలు, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.భుజంగరావు, టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమళ, హౌసింగ్ అధికారి పి.బాబు, ఏడీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ, సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.