ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:04 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో గురువారం నిర్వహించిన నీతి ఆయోగ్ ప్రాజెక్టు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన అల్లూరి జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు.
వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి
ఎకో టూరిజానికి ప్రోత్సాహం
అరకు, లంబసింగి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాభివృద్ధి
నీతి ఆయోగ్ ప్రాజెక్టు సమావేశంలో కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో గురువారం నిర్వహించిన నీతి ఆయోగ్ ప్రాజెక్టు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమైన అల్లూరి జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో అరకులోయ, లంబసింగి ప్రాంతాలను పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గిరిజనుల సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలు, కళలు, వైవిధ్యమైన జీవన విధానాన్ని సైతం పర్యాటకులు తెలుసుకుంటారని కలెక్టర్ చెప్పారు. ఇదే సమయంలో పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించి, ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఇంకా స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుందన్నారు.
ఏజెన్సీలో నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలను విరివిగా సాగు చేయాలని నిర్ణయించామని, జిల్లా ఆర్థికాభివృద్ధికి వ్యవసాయం రంగం కూడా కీలకం కానున్నదని కలెక్టర్ వెల్లడించారు. గిరిజన రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే కాఫీ, మిరియాలు, పసుపు పంటల సాగును ప్రోత్సాహిస్తున్నామని, ఆధునిక పద్ధతిలో సాగు, పండించిన పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కొత్త జిల్లా అయినప్పటికీ ప్రణాళికబద్ధమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో కుంకుమ పువ్వు సాగుకు గిరిజన రైతులను ప్రోత్సాహిస్తున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా విద్యా శాఖాధికారి కె.రామకృష్ణారావు, ఎల్‌డీఎం మాతునాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.