ప్రతి హామీ నెరవేరుస్తాం
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:19 AM
గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఎటువంటి ఆందోళన చెందవద్దని, అపోహలు పెంచుకోవద్దని, ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.
ఆందోళన చెందొద్దు
గూగుల్ డేటా సెంటర్‌కు భూములు ఇచ్చిన తర్లువాడ రైతులకు ఎమ్మెల్యే గంటా హామీ
పనులకు సహకరిస్తామన్న వైసీపీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఎటువంటి ఆందోళన చెందవద్దని, అపోహలు పెంచుకోవద్దని, ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఎంవీపీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో తర్లువాడ రైతులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. రెండు రోజుల్లో కలెక్టర్‌తో సమావేశమై సానుకూల నిర్ణయం తీసుకంటామన్నారు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా సంతృప్తిగా ఉన్నారని, పరిహారం పెంపులోను ఉదారంగా వ్యవహరించారని గుర్తుచేశారు. డీపట్టా భూములకు ఎకరాకు 20 సెంట్ల భూమి, షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం సహా ఆ 520 మందికి మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తామని గంటా పునరుద్ఘాటించారు. సమాచార లోపం కారణంగా రైతులు ఆందోళన చెందిన అక్కడ జరుగుతున్న పనులను ఆపారన్నారు. డీపట్టా మాదిరిగానే జిరాయితీ భూమికి పరిహారం ఇవ్వడం పట్ల బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తంచేయగా గంటా వారితో ఏకీభవించారు. వారికి న్యాయం జరిగేలా సీఎంతో మాట్లాడతానన్నారు. రైతులు వ్యక్తంచేసిన అనుమానాలన్నింటిని ఎమ్మెల్యే నివృత్తి చేసి, భరోసా ఇవ్వడంతో వారంతా సంతృప్తి వ్యక్తంచేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాయని, గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని వివరించారు. వారిపై దృష్టిసారించాలన్నారు. మొదటి నుంచి తమకు అండగా ఉంటున్నందుకు ఎమ్మెల్యే గంటాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల తరపున వైసీపీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు మజ్జి వెంకటరావు మాట్లాడుతూ, డేటా సెంటర్ పనులకు సహకరిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓ సంగీత్ మాధుర్, ఏసీపీ అప్పలరాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.