Share News

మహాప్రస్థానం సేవలు విస్తరిస్తాం

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:51 AM

మహా ప్రస్థానం అంబులెన్స్‌ సేవలను ఏజెన్సీ ప్రాంతాల వరకు విస్తరిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రకటించారు.

మహాప్రస్థానం సేవలు విస్తరిస్తాం

జడ్పీ సమావేశంలో కలెక్టర్‌

రెడ్డిపల్లిలో డ్రైనేజీల నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటన

విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

మహా ప్రస్థానం అంబులెన్స్‌ సేవలను ఏజెన్సీ ప్రాంతాల వరకు విస్తరిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రకటించారు. శనివారం జడ్పీ సమావేశంలో అంబులెన్స్‌ సేవలపై ఏజెన్సీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయడంతో ఆయన స్పందించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన వారిని తరలించే విషయంలో వస్తున్న సమస్య పరిష్కరిస్తామన్నారు. దీనిపై కేజీహెచ్‌ అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. రిఫరల్‌ కేసులను త్వరితగతిన ఆమోదిస్తూ సేవలు వేగవంతం చేస్తామన్నారు. విశాఖ నుంచి దేవరాపల్లి మండలం వేచలం, తిమిరాం ప్రాంతాలకు బస్సులు కావాలని పలువురు సభ్యులు కోరగా, ఫీజిబిలిటీ ఉంటే పరిశీలిస్తామన్నారు. కాగా పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా జరగడం లేదని జడ్పీటీసీ సభ్యుడు సుంకరి గిరిబాబు ఫిర్యాదు చేశారు. మండలంలోని సగం గ్రామాల్లో ఈ సమస్య ఉంందని పేర్కొంటూ, తక్షణమే రెడ్డిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయాలన్నారు. పద్మనాభం-విజయనగరం రోడ్డు విస్తరణలో భాగంగా రెడ్డిపల్లిలో ఇరువైపులా ఇళ్లు తొలగించారని, అయితే ఇంతవరకు డ్రైన్లు నిర్మించలేదన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పదించి డ్రైన్ల నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


విమ్స్‌ నుంచి కేజీహెచ్‌కు నర్సింగ్‌ సిబ్బంది

డిప్యూటేషన్‌పై 16 మంది...

విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో నర్సింగ్‌ సిబ్బంది కొరత సేవలపై ప్రభావం చూపుతోంది. నూతనంగా నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ కొద్దిరోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. కనీసం 30 మంది వరకు నర్సింగ్‌ సిబ్బంది కావాలని ఆస్పత్రి అధికారులు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కోరారు. అయితే, నియామక ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టనున్నందున క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో సేవలు అందించడానికి విమ్స్‌ నుంచి కొంతమందిని డిప్యూటేషన్‌పై పంపుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆదేశాల మేరకు విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు శనివారం 16 మంది స్టాఫ్‌ నర్సులు, నలుగురు డీఈవోలను కేజీహెచ్‌కు బదిలీ చేశారు.

Updated Date - Mar 29 , 2026 | 12:51 AM