Share News

కాలుష్యాన్ని నియంత్రిస్తాం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:05 AM

ఎక్కువ సరకును రవాణా చేయాలనే ఒకే లక్ష్యం కోసం కాకుండా సమయం సద్వినియోగం అయ్యేలా, తద్వారా అన్ని ఖర్చులు తగ్గేలా చూస్తున్నామని పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోశ్ని అపరంజి తెలిపారు.

కాలుష్యాన్ని నియంత్రిస్తాం

ఒక్క ఫిబ్రవరి నెలలోనే టార్పాలిన్‌ లేని 1,191 ట్రక్కులకు జరిమానా

కస్టమ్స్‌ నోటిఫైడ్‌ ఏరియా చుట్టూ పెద్దఎత్తున గోడల నిర్మాణం

‘ఆంధ్రజ్యోతి’తో విశాఖపట్నం పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోశ్ని అపరంజి

సంస్థ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

పూర్తిగా ఇంజన్‌ ఆన్‌ లోడింగ్‌

టర్న్‌ ఎరౌండ్‌ టైమ్‌ తగ్గించడమే లక్ష్యం

దుగరాజుపట్నం పోర్టు, షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో విశాఖ పోర్టుకు 50 శాతం వాటా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎక్కువ సరకును రవాణా చేయాలనే ఒకే లక్ష్యం కోసం కాకుండా సమయం సద్వినియోగం అయ్యేలా, తద్వారా అన్ని ఖర్చులు తగ్గేలా చూస్తున్నామని పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోశ్ని అపరంజి తెలిపారు. పోర్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమని, ప్రతి ఉద్యోగి సంస్థ ప్రగతి కోసం పనిచేయాలన్నారు. పోర్టులో కాలుష్యం తగ్గించే పనులు అన్ని చేపడుతున్నామని, ఒక్క ఫిబ్రవరి నెలలోనే టార్పాలిన్‌ కప్పకుండా సరకును తరలిస్తున్న 1,191 ట్రక్కులకు జరిమానా విధించామన్నారు. ఆమె మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులు వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

- పోర్టును మెకనైజేషన్‌ చేస్తేనే కాలుష్యం తగ్గుతుంది. ఆ మేరకు 100 శాతం పనులు పూర్తి చేశాం. పోర్టులో 176 కి.మీ. పొడవైన ఇన్నర్‌ రైల్వే ట్రాక్‌ ఉంది. ఇప్పుడు ‘ఇంజన్‌ ఆన్‌ లోడింగ్‌’ అనే విధానంలో రైలు సైడింగ్‌ (ట్రాక్‌)పై ఉండగానే సరకును లోడింగ్‌ చేసేలా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. ఈ పనులు కూడా 95 శాతం పూర్తయ్యాయి.

- పోర్టులో కాలుష్యం తగ్గించే పనులు అన్ని చేపడుతున్నాం. ఒక్క ఫిబ్రవరి నెలలోనే టార్పాలిన్‌ కప్పకుండా సరకును తరలిస్తున్న 1,191 ట్రక్కులకు జరిమానా విధించాం. గత నవంబరులో ఒక్క లారీకి జరిమానా వేయలేదు. డిసెంబరులో ఆరింటికి, జనవరిలో కేవలం రెండింటికి మాత్రమే జరిమానా వేశారు. ఇప్పుడు కచ్చితంగా టార్పాలిన్‌ ఉండాల్సిందే అని నిబంధన పెట్టి, అవి లేకుండా వెళితే జరిమానా వేస్తున్నాం. కస్టమ్స్‌ నోటిఫైడ్‌ ఏరియా మొత్తం పెద్దఎత్తున గోడలు నిర్మించి, కాలుష్యం లేకుండా చేస్తున్నాం.

- పోర్టులో ‘టర్న్‌ ఎరౌండ్‌ టైమ్‌’ అనేది చాలా ముఖ్యం. ఒక నౌక పోర్టులోకి వస్తే...ఎంత వేగంగా అందులో సరుకును అన్‌లోడింగ్‌ చేసి బయటకు పంపించామనేది కీలకం. ఈ అన్‌లోడింగ్‌, లోడింగ్‌కు తీసుకునే సమయాన్నే ‘టర్న్‌ ఎరౌండ్‌ టైమ్‌’గా లెక్కిస్తారు. ఎక్కువ సమయం నౌకను బెర్తుపై ఉంచితే బెర్తు చార్జీలతో పాటు నౌకకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. తక్కువ టైమ్‌లో చేస్తే సరుకు తెప్పించుకునేవారికి, పంపేవారికి కూడా లాభదాయకం. అందుకని ఈ టర్న్‌ ఎరౌండ్‌ టైమ్‌ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

- కంటెయినర్లను అతి తక్కువ సమయంలో క్లియర్‌ చేసి పంపించడంలో విశాఖపట్నం పోర్టు కంటెయినర్‌ టెర్మినల్‌ లిమిటెడ్‌ (వీపీసీటీఎల్‌) ప్రపంచ స్థాయిలో టాప్‌ 20లో ఒకటిగా నిలిచింది. పోర్టు సరకు రవాణాలో 12 శాతం కంటెయినర్‌ కార్గోనే ఉంటుంది.

- 2025-26 ఆర్థిక సంవత్సరంలో పోర్టు కార్గో లక్ష్యం 90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. ఇప్పటికే 82.56 మిలియన్‌ టన్నులు పూర్తిచేశాం. వెసల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, ఇతర విభాగాల సమన్వయంతోనే లక్ష్యం మేరకు చేయగలుగుతున్నాం.

- రాష్ట్ర ప్రభుత్వం దుగరాజుపట్నంలో నిర్మిస్తున్న పోర్టు, షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో విశాఖపట్నం పోర్టు భాగస్వామిగా ఉంది. 50ః50 నిష్పత్తిలో పెట్టుబడి పెడుతున్నాం. మొత్తం వ్యయం రూ.29 వేల కోట్లు. దశల వారీగా పనులు చేపడతాం. దీనికి త్వరలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు కానుంది.

- విశాఖపట్నం పోర్టులో బొగ్గు దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది సుమారుగా 6 శాతం తగ్గింది. అదే సమయంలో ఎల్‌పీజీ, క్రూడాయిల్‌ దిగుమతులు పెరుగుతున్నాయి.

- పోర్టుకు రైల్వే ర్యాకుల కొరత కొద్దిగా ఉంది. రోజుకు 17-18 అవసరం కాగా 12-13 వస్తున్నాయి.

- పోర్టులకు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసేలా పనిచేస్తున్నాం. ఒక అవసరం కోసం తీసుకొని, వాటిని ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటన్నింటినీ సమీక్షిస్తాం.

- అక్కయ్యపాలెంలోని స్డేడియంపై పోర్టుకు అనుకూలంగానే కోర్టు తీర్పు వచ్చింది. అందులో కొన్ని కొత్త ఆస్తులు వచ్చాయి. అవి సద్వినియోగం అయ్యేలా చూస్తాం. స్టేడియం ప్రధానంగా క్రీడలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసింది కాబట్టి ఆ దిశగా దానిని ముందుకు తీసుకువెళతాం.

- విశాఖపట్నం పోర్టు స్కూల్‌ సాలగ్రామపురంలో సింగిల్‌ టీచర్‌తో ప్రారంభమైంది. ఆ సింగిల్‌ టీచర్‌ మా నాన్నే. ఇప్పుడు ఆ పాఠశాల మూతపడింది. దానిని తిరిగి తెరవడానికి నిబంధనల మేరకు నా వంతు ప్రయత్నం చేస్తాను.

ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ చేస్తాం

పోర్టులో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి కోసం పోర్టు ఆస్పత్రిని సొంత నిధులతోనే అప్‌గ్రేడ్‌ చేసి, కేవలం ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ మాత్రమే ప్రైవేటుకు ఇవ్వాలనుకుంటున్నాం. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనమే ముఖ్యం.

Updated Date - Mar 04 , 2026 | 01:05 AM