Share News

జీవో-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:59 AM

ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు జీవో నంబరు-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, దీనికి ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

జీవో-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికి హాజరైన ఇన్‌చార్జి మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కలెక్టర్‌, ఎస్పీ

ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పనకు కట్టుబడి ఉన్నాం

అరకు కాఫీ తరహాలో లంబసింగిలో కుంకుమపువ్వు సాగు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జులు, కలెక్టర్‌, ఎస్పీతో భేటీ

చింతపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు జీవో నంబరు-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, దీనికి ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం అమరావతిలో అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జి మంత్రులు, పార్టీ ఇన్‌చార్జులు, జిల్లా కలెక్టర్‌, ఏస్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఇన్‌చార్జులు, కలెక్టర్‌, ఎస్పీలతో నియోజకవర్గాలవారీగా అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పాడేరు నియోజకవర్గం ముందు వరుసలో ఉందని చంద్రబాబు అభినందించారు. జీవో నంబరు-3పై పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ప్రస్తావించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల ముందు గిరిజనులకు జీవో నంబరు-3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చామని, దీనిని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఐదో షెడ్యూల్డ్‌లో ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలకు రూపకల్పన చేయాలని ముఖ్య కార్యదర్శిని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో రానున్న రోజుల్లో డోలీ మోతలు ఉండరాదని, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రహదారులు నిర్మించాలని కలెక్టర్లను సీఎం సూచించారు. గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఏఎన్‌ఎం, హెల్త్‌ వలంటీర్లను నియమిస్తున్నామన్నారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనువుగా ప్రతి మండలంలో బాలికలు, బాలురకు రెండు గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్‌ కళాశాలలుగా స్థాయి పెంచాలన్నారు. ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో సదుపాయాలు, మందులు, పరికరాలు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులకు వసతి గృహాలను నిర్మించాలన్నారు. మండలానికి ఒక మహాప్రస్థానం అంబులెన్సు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ జిల్లా వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమన్నారు. అరకు కాఫీ తరహాలో లంబసింగి కుంపుమపువ్వు సాగుకు ప్రసిద్ధిగా తీర్చిదిద్దాలన్నారు. గిరిజన రైతులు నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేసేందుకు చర్యలు ప్రారంభించాలని చెప్పారు. అరకు కాఫీ సాగును ప్రోత్సహించాలన్నారు. రైతులకు కాఫీ ద్వారా మంచి ఆదాయం రావాలన్నారు. లంబసింగిలో కుంకుమపువ్వు సాగు ప్రారంభించాలన్నారు. కుంకుమపవ్వు సాగు ద్వారా గిరిజన రైతుల ఆర్థిక ప్రగతిలో పెనుమార్పు వస్తుందన్నారు. ఈ సమావేశంలో మన్యం, ఏఎస్‌ఆర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌, పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి దొన్నుదొర, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:59 AM