స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:17 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పిలుపునిచ్చారు.
సమన్వయ కమిటీ జిల్లా ఇన్‌చార్జి,
ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పిలుపు
పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయంతో పనిచేయండి
కూటమి పాలనలో అభివృద్ధిని వివరించండి
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించండి
పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌ఆర్.శంకరన్ ఆడిటోరియంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో శనివారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి కూటమి అభ్యర్థులను కచ్చితంగా గెలిపించాలన్నారు. గ్రామాల్లో కూటమి పాలనలో అమలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలనే ప్రచారాస్త్రాలుగా శ్రేణులు వినియోగించాలన్నారు. ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలోనూ కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత సంక్షేమానికి చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలన్నారు. తమ పాలనలో లబ్ధిపొందిన ప్రతి కుటుంబాన్ని కూటమి నేతలు కలవాలని, వారికి ప్రభుత్వం చేసిన మేలును వివరించాలన్నారు. ఈక్రమంలో స్థానికంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో నడవాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమి చైర్మన్ వంపూరు గంగులయ్య, బీజేపీ అరకు పార్లమెంట్ ఇన్‌చార్జి పాంగి రాజారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్.ప్రసాద్, కొట్టగుళ్లి సుబ్బారావు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్‌నాయుడు, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ సీనియర్ నేతలు చల్లంగి లక్ష్మణరావు, బొర్రా విజయరాణి, డప్పొడి వెంకటరమణ, బీజేపీ నేతలు పెనుమాక రవికుమార్, మఠం శాంతకుమారి, కురుసా ఉమామహేశ్వరరావు. కూటమి పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.