Share News

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెలుచుకోవాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:06 AM

తెలుగుదేశం పార్టీకి నాడు, నేడు కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెలుచుకోవాలి
మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

కూటమి అభ్యర్థుల విజయానికి ఇప్పటినుంచే సమన్వయంతో పనిచేయాలి

పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశానిర్దేశం

కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

కె.కోటపాడు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి నాడు, నేడు కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ కోడూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మాడుగుల నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఏడుసార్లు టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని, ఇది పార్టీకి గర్వకారణమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మూడుసార్లు టీడీపీ ఓటమి చెందిందని, అయితే అందుకు కార్యకర్తలను బాధ్యులను చేయలేమన్నారు. నాయకత్వ వైఫల్యాల కారణంగానే అపజయాలు ఎదురయ్యాయని తెలిపారు. కార్యకర్తలు మాత్రం ప్రతి ఎన్నికల్లో చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశారని అభినందించారు.

కష్టపడిన వారికి గుర్తింపు

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. మండల టీడీపీ నాయకులు, క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జిలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు వారికి తగిన గౌరవం దక్కేలా చూస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసే సాధారణ కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో క్లస్టర్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన సాధారణ మహిళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త పార్టీకి అండగా నిలిచి ప్రజలతో మమేకం కావాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబులు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు తో కార్యకర్తలు, నాయకులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 వందల మంది మండల, క్లస్టర్‌, గ్రామ స్థాయి నాయకులు హాజరయ్యారు.

Updated Date - Aug 23 , 2026 | 01:06 AM