Share News

జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:58 AM

త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు.

జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి

‘నార్త్‌’ నేతలు, కార్యకర్తలకు ఎంపీ ఎం.శ్రీభరత్‌ పిలుపు

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

విశాఖపట్నం,సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వార్డు స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం మరింత బలోపేతం కావాలన్నారు. కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని ఎంపీ సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఐక్యత ఉంటేనే సంస్థాగతంగా బలపడతామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ పరిశీలకుడు ఎంఏఏ షరీఫ్‌, నియోజకవర్గ పరిశీలకుడు కిమిడి రామమల్లిక్‌ నాయుడు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వార్డు అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


భీమిలితో మొదలు, అడవివరంతో ఆఖరు..

ఇదీ గ్రేటర్‌ వార్డుల పునర్విభజన తీరు

‘నార్త్‌’ జోన్‌లో అత్యధికంగా 20 వార్డులు

భీమిలి జోన్‌లో అత్యల్పంగా ఐదు వార్డులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ కూడా జారీచేయడంతో ఎన్నికలకు ముందడుగు పడినట్టయింది. అయితే నియోజకవర్గాల వారీగా ఇటీవల జోన్‌లను ఏర్పాటుచేయడంతో ఏ జోన్‌లో ఎన్ని వార్డులు ఉన్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో 19 లక్షలుగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. దీని ప్రకారం ప్రతి వార్డులో సగటున 15,840 మంది ఉండేలా విభజన ప్రక్రియ చేపట్టారు. భౌగోళిక సరిహద్దు కోసం పది శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. భీమిలి, పెందుర్తి, గాజువాక, మధురవాడ వంటి ప్రాంతాల్లో కొన్ని వార్డులు వైశాల్యం ప్రకారం పెద్దవిగా ఉండగా, నగరం నడిబొడ్డున ఉన్న తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో మాత్రం జనసాంద్రత ఎక్కువ కావడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. వార్డుల పునర్విభజన జీవీఎంసీ పరిధిలో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభమై క్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లో సాగింది. భీమిలి జోన్‌లోని కొండపేట కాలనీ, గోస్తనీ నదిని ఆనుకుని ఉన్న వసంతవిహార్‌ లేఅవుట్‌ మీదుగా చిట్టివలస పరిసర ప్రాంతాలను ఒకటో వార్డుగా విభజించారు. చిట్టివలస పెద్దచెరువు నుంచి దక్షిణం వైపు ఉన్న నమ్మివానిపేటరోడ్డు, సంగివలస మీదుగా డెక్కటిపాలెం వరకు రెండో వార్డుగా విభజించారు. ఐఎన్‌ఎస్‌ కళింగ జంక్షన్‌ నుంచి దక్షిణం వైపున కాపులుప్పాడ పశ్చిమాన నిడిగట్టు, ఉత్తరవైపున నేరేళ్లవలస మీదుగా తిరిగి ఐఎన్‌ఎస్‌ కళింగ వరకూ ఐదో వార్డుతో భీమిలి జోన్‌ పరిధి ముగుస్తుంది.

పరదేశిపాలెం నుంచి మారికవలస జంక్షన్‌, జాతీయ రహదారిపై సాయిప్రియ లేఅవుట్‌ వంద అడుగులు రోడ్డు హౌసింగ్‌ బోర్డుకాలనీ, బోయపాలెం మీదుగా కంబాలకొండరిజర్వు ఫారెస్ట్‌ వరకు ఆరో వార్డుగా విభజించారు. కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్‌ నుంచి అడవివరం జంక్షన్‌, పాతగోశాల, ప్రహ్లాదపురం, సింహపురి లేఅవుట్‌ ఫేజ్‌-2, ఎర్రకొండ ఫారెస్ట్‌ ప్రాంతాలను 120వ వార్డుగా నిర్ణయించారు.

నార్త్‌ జోన్‌లో అత్యధిక వార్డులు...అగనంపూడి అత్యల్పం

జీవీఎంసీ పరిధిలోని పది జోన్లలో ఉత్తర జోన్‌లో అత్యధికంగా 20 వార్డులు ఉండగా, భీమిలి, అగనంపూడి జోన్‌ల పరిధిలో కేవలం ఐదేసి వార్డులు మాత్రమే ఏర్పడ్డాయి. మధురవాడ జోన్‌లో ఏడు, తూర్పుజోన్‌లో 18, దక్షిణ జోన్‌లో 16, పశ్చిమ జోన్‌లో 17, గాజువాక జోన్‌లో 19, అనకాపల్లి జోన్‌లో ఆరు, పెందుర్తి జోన్‌లో ఏడు చొప్పున మొత్తం 120 వార్డులను విభజించారు.

జోన్‌ వార్డుల వార్డు

సంఖ్య నంబర్లు

భీమిలి 5 ఒకటి నుంచి ఐదు

మధురవాడ 7 6 నుంచి 11 మరియు 120

తూర్పు 18 12 నుంచి 29

దక్షిణం 16 30 నుంచి 46

ఉత్తర 20 46 నుంచి 65

పశ్చిమం 17 66 నుంచి 82

గాజువాక 19 83 నుంచి 101

అగనంపూడి 5 102 నుంచి 106

అనకాపల్లి 6 107 నుంచి 112

పెందుర్తి 7 113 నుంచి 119

-------------------

Updated Date - Sep 18 , 2026 | 12:58 AM