విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:49 AM
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారు ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుల బోధన మెరుగుపడాలి
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారు ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షాల ఫలితాల విడుదల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఏపీ మోడల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడం అభినందనీయమని అన్నారు. ఈ ఫలితాలను అధ్యయనంచేసి, ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయో గమనించి, ఆయా సబ్జెక్టుల బోధనను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సగటుకన్నా తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల నిర్వాహకులపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని, అందువల్ల వారికి వెంటనే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా, వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.