అపార్టుమెంట్లలో నీటికి కటకట
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:36 AM
నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. జీవీఎంసీ నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకున్నా సకాలంలో అందడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. వారిపై నిఘా లేదు. నియంత్రణ లేదు.
భూగర్భ జలాలు అడుగంటడంతో పనిచేయని బోర్లు
నిత్యావసరాలకు కూడా జీవీఎంసీపై ఆధారపడాల్సిన పరిస్థితి
రోజుకు ఒకటి, రెండు ట్యాంకర్లకు మించి సరఫరా చేయలేకపోతున్న నగర పాలక సంస్థ
ఫోన్లకు స్పందించని నీటి సరఫరా విభాగం అధికారులు
ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ
ఆరు వేల లీటర్ల ట్యాంకర్...రూ.1,500
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. జీవీఎంసీ నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకున్నా సకాలంలో అందడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. వారిపై నిఘా లేదు. నియంత్రణ లేదు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గత ఏడాదితో పోల్చితే అన్ని ప్రాంతాల్లో సగటున రెండు మీటర్ల దిగువకు జలాలు వెళ్లిపోయాయి. దాంతో బోర్ల నుంచి నీరు రావడం లేదు. నిత్యావసరాలకు కటకటలాడుతున్నారు. సీతమ్మధార, మద్దిలపాలెం, శివాజీపాలెం, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, మిథిలాపురి వుడా కాలనీ, అటు గాజువాక తదితర ప్రాంతాల్లో కొత్త బోర్లు 500 అడుగుల లోతున వేస్తే గానీ నీరు లభించడం లేదు. అది చాలదని మరో 300 అడుగులు కలిపి 800 అడుగుల వరకు వెళుతున్నారు. వాటిలో కూడా అరకొరగానే నీరు వస్తోంది.
నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లలో నిల్వలు తగ్గుతున్నాయి. తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం, గోస్తనీలలో నీటి మట్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ నీటి సరఫరా సమయం తగ్గించేస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు. పలుకుబడి కలిగిన నాయకులు మాత్రమే జీవీఎంసీ అధికారులతో మాట్లాడి వారి వార్డులకు ట్యాంకర్లతో నీరు ఇప్పించుకోగలుగుతున్నారు. అధికారులు వారి సేవలో పడి సామాన్య ప్రజలు చేసే ఫోన్లకు స్పందించడం లేదు. నీటి ట్యాంకర్ల కోసం సంప్రతించాల్సిన నంబర్లు అంటూ జీవీఎంసీ ప్రకటించినప్పటికీ ఆ అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు. టీఎస్‌ఎఆర్ కాంప్లెక్స్, ఎండాడ రిజర్వాయర్ రెండింటిలోను అదే దుస్థితి.
నగర శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్టుమెంట్లు ఉన్నాయి. ఒక్కో కమ్యూనిటీకి సగటున రోజుకు పది నుంచి ఇరవై ట్యాంకర్ల నీరు అవసరమవుతోంది. వాటిలో పది వేల లీటర్ల నుంచి లక్ష లీటర్ల వరకు డిమాండ్ ఉంది. జీవీఎంసీ ట్యాంకర్లకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రోజుకు రెండు ట్యాంకర్లు అంటే పది వేల నుంచి 12 వేల లీటర్లు ఇవ్వడమే కష్టంగా ఉంది. మిగిలిన నీటికి ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వారు రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు. జీవీఎంసీ నుంచి ట్యాంకర్ తీసుకొని దానిపై అధమంగా రూ.500, అత్యధికంగా రూ.2 వేలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మధురవాడ, పీఎంపాలెం పరిసరాల్లో ఆరు వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. వీరు వ్యవసాయ భూముల్లో తవ్విన బావుల నుంచి నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం అయినప్పటికీ అధికారులు చూసీచూడనట్టు ఉంటున్నారు. కొందరు సిబ్బంది వారి నుంచి కూడా ట్యాంకర్‌కు ఇంత అని రేటు పెట్టి లంచాలు తీసుకుంటున్నారు. దాంతో వారు రేట్లు మరింత పెంచేస్తున్నారు. నేతలకు, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే...ఎన్ని లీటర్ల ట్యాంకర్ ఎంత ధరకు విక్రయించాలో స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ విధంగానైనా ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీకి అడ్టుకట్టపడే అవకాశం ఉంది.