నిరుపయోగంగా నీళ్ల కుండీలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:06 AM
మూగజీవాల దాహం తీర్చాలన్న సంకల్పంతో పంచాయతీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నీళ్ల కుండీలు నిరుపయోగంగా ఉన్నాయి.
నీటి వసతి లేని చోట నిర్మించి చేతులు దులిపేసుకున్న అధికారులు
ప్రజా ధనం వృథా
కొయ్యూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మూగజీవాల దాహం తీర్చాలన్న సంకల్పంతో పంచాయతీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నీళ్ల కుండీలు నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులు అనాలోచితంగా నీటి వసతి లేని చోట ఎక్కడబడితే అక్కడ నీళ్ల కుండీలను నిర్మించి చేతులు దులిపేసుకోవడంతో వృథాగా పడి ఉన్నాయి.
వేసవిలో చెరువులు, వాగులు ఎండిపోయి మూగజీవాలు దప్పికతో అలమటిస్తాయని భావించి వాటి కోసం ప్రతీ పంచాయతీ కేంద్రంలో నీళ్ల కుండీలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఒక్కో కుండీని రూ.30 వేలతో నిర్మించింది. అధికారులు ఎటువంటి ప్రణాళిక లేకుండా నీటి వసతి లేని చోట ఎక్కడబడితే అక్కడ కుండీలను నిర్మించి చేతులు దులిపేసుకున్నారు. దీంతో కుండీలు ఉన్నాయి గానీ వీటిలో చుక్కనీరు లేదు. వీటిని నీటితో నింపాలన్నా సమీపంలో నీరు లభ్యమయ్యే పరిస్థితులు లేవు. దీని వల్ల ప్రభుత్వ ఉన్నత లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్ల కుండీలకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.