నీటి టాంకర్ల దోపిడీ
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:39 AM
రిజర్వాయర్లలో నిల్వలు పడిపోవడంతో నగరంలో కొళాయిల ద్వారా నీటి సరఫరా సమయం తగ్గిపోతోంది.
నీటి ట్యాంకర్ల దోప్రజల ఇబ్బందులను
ఆసరాగా తీసుకుని
ధరలు భారీగా పెంచేసిన యజమానులు
టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ వద్ద జనం పడిగాపులు
------------------------
మద్దిలపాలెం పరిసరాలకు గతంలో ఉన్న ధరలు
ట్యాంకర్ కెపాసిటీ గతంలో ధర ప్రస్తుతం
1 కేఎల్ రూ.500 రూ.800-రూ.వెయ్యి
2 కేఎల్ రూ.800 రూ.1500-రూ.2000
6 కేఎల్ రూ.1500 రూ.ఐదు వేలు
------------------------
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రిజర్వాయర్లలో నిల్వలు పడిపోవడంతో నగరంలో కొళాయిల ద్వారా నీటి సరఫరా సమయం తగ్గిపోతోంది. కొన్ని ప్రాంతాలకు రెండు, మూడు రోజులకొకసారి మాత్రమే నీరు సరఫరా చే స్తున్నారు. ఇదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా పనిచేయకపోవడంతో రోజువారీ అవసరాలకు కూడా నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదే అదనుగా ట్యాంకర్ల యజమానులు ధరలను విపరీతంగా పెంచేశారు.
నగరంలో కొళాయిల ద్వారా నీరు ఇచ్చేందుకు అవకాశం లేని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు జీవీఎంసీకి సొంతంగా ఐదు కిలోలీటర్ల నీటి ట్యాంకర్లు మూడు, ఆరు కిలోలీటర్ల ట్యాంకర్లు రెండు కొనుగోలు చేసింది. ఇవికాకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి రెండు కిలోలీటర్ల ట్యాంకర్లు నాలుగు, ఐదు కిలోలీటర్ల ట్యాంకర్లు 22, ఆరు కిలోలీటర్లు ట్యాంకర్లు రెండు అద్దెకు తీసుకుంది. వీటి ద్వారా జీవీఎంసీ ఉచితంగా నీటిని సరఫరా చేస్తుంది. ట్యాంకర్ల యజమానులకు నెలవారీ అద్దె చెల్లిస్తుంది. ఇవికాకుండా ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, ఆస్పత్రులతోపాటు అవసరమైన వారికి నీరు సరఫరా చేసేందుకు వీలుగా ప్రైవేటు ట్యాంకర్లు ఉన్నాయి. ట్యాంకర్ల యజమానులు ఒక కిలోలీటర్ నీటికి రూ.40 చొప్పున జీవీఎంసీ సౌకర్యం కేంద్రంలో చలాన్ తీసి, టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌లోని పంప్‌హౌస్ వద్ద ఉండే సిబ్బందికి అందజేస్తే వారు ఆ మేరకు నీటిని నింపుతారు. ప్రైవేటు ట్యాంకర్‌ల యజమానులు దూరాన్ని బట్టి నీటిని విక్రయిస్తుంటారు. ఈ విధంగా ఒక కిలోలీటర్ సామర్థ్యం కలిగిన ఆటోలు 150, రెండు కిలోలీటర్లు వ్యాన్‌లు 97, ఆరు కిలోలీటర్లు ట్యాంకర్లు 97 ఉన్నాయి. ఇవన్నీ తమను ఫోన్ ద్వారా లేదా జీవీఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రతించే వారికి నీరు సరఫరా చేస్తుంటాయి. అయితే నగరంలో తాగునీటి ఎద్దడితోపాటు బోర్లు కూడా ఎండిపోవడంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ట్యాంకర్ల యజమానులు టీఎస్‌ఆర్ రిజర్వాయర్ నుంచి తీసుకునే నీటిని హోటళ్లు, ఆస్పత్రులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల కొనుక్కుందామనుకున్నా ప్రజలకు నీటి ట్యాంకర్లు దొరకడం లేదు.
ట్యాంకర్ల కోసం జనాలు క్యూ
ప్రజలు ట్యాంకర్ల కోసం నేరుగా టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌కే వస్తున్నారు. అక్కడ సిబ్బందిని, అధికారులను కలిసి తాగడానికి నీరులేక ఇబ్బందిపడుతున్నామని, ట్యాంకర్‌తో నీటిని పంపిస్తే డబ్బులు ఇస్తామని అడుగుతున్నారు. దీంతో తాము సూచించిన వారికే నీరు సరఫరా చేయాలని సోమవారం ట్యాంకర్ల యజమానులకు జీవీఎంసీ సిబ్బంది షరతు విధించారు. టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌కు వచ్చే ప్రజలకు అధికారులు స్లిప్ రాసి ఇస్తే దానిని ట్యాంకర్ల యజమానులకు అందజేస్తున్నారు. తర్వాత ధర మాట్లాడుకుని ట్యాంకర్‌ను తీసుకుళుతున్నారు.
దరలు పెంచేసిన ట్యాంకర్ల యజమానులు
నీటికి డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ల యజమానులు ఇదే అదనుగా ధరలు పెంచేశారు. గతంలో మద్దిలపాలెం, రేసపువానిపాలెం, హెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాలకు ఒక కిలోలీటర్ ట్యాంకర్‌ను తీసుకువెళితే రూ.500 వసూలుచేసేవారు. ఇప్పుడు రూ.800 నుంచి వెయ్యి వరకు తీసుకుంటున్నారు. అలాగే రెండు కిలోలీటర్ల ట్యాంకర్‌కు గతంలో మద్దిలపాలెం పరిసర ప్రాంతాలకు రూ.వెయ్యి వరకు వసూలుచేస్తే ఇప్పుడు రూ.1500 నుంచి రూ.రెండు వేలు వరకు పెంచేశారు. ఆరు కిలోలీటర్లు ట్యాంకర్‌ను గతంలో రూ.1500కి తీసుకుంటే ఇప్పుడు రూ.ఐదు వేలు చేశారు. అయినప్పటికీ తప్పనిసరి కాబట్టి ప్రజలు ట్యాంకర్ యజమానులు చెప్పిన ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.