సాగునీటి వనరులకు ‘జలధార’
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:39 PM
గిరిజన ప్రాంతంలో సాగు నీటివనరులకు జవసత్వాలు కల్పించేందుకు ‘జలధార’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ సాగుకు పంట పొలాలకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడమే లక్ష్యంగా చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు చేపట్టింది. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను విడుదల చేసింది.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో
చెక్‌డ్యామ్, చెరువుల మరమ్మతులు
ఖరీఫ్‌కు సాగునీరు అందించడమే లక్ష్యం
చింతపల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో సహజ జలవనరులను వినియోగించుకుంటూ ఆదివాసీ రైతులు వ్యవసాయం చేసేందుకు చెరువులు, చెక్‌డ్యామ్, జలాశయాలను ప్రభుత్వం నిర్మించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి వనరుల బాగోగులు పట్టించుకోలేదు. దీంతో చెరువులు, చెక్‌డ్యామ్‌ల దిగువనున్న పంట పొలాలకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందడంలేదు. ఈకారణంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆర్గానిక్ జోన్‌గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రైతులకు ప్రత్యేక పథకాలను అమలుపరుస్తున్నది. నిర్లక్ష్యానికి గురైన సాగు నీటి వనరులను మరమ్మతులు చేపట్టేందుకు ఉపాధి నిధులను మంజూరు చేసింది. ప్రధానంగా సాగు నీటి వనరుల అభివృద్ధికి జలధార, ఓఎన్‌ఎం కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.
11చెరువులు, చెక్ డ్యామ్‌లు అభివృద్ధి
మండలంలో జలధారలో 11 చెరువులను ఇరిగేషన్ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా కట్టుబంద చెక్‌డ్యామ్, బెన్నవరం చెరువు, తాజంగి జలాశయం, చౌడుపల్లి, అంతర్ల, పెండ్లిమామిడి, తెరపల్లి, తాళ్లకోట చెరువులు, పెద్దబరడ, బద్దిమెట్ట చెక్‌డ్యామ్, సిరిపురం చెక్‌డ్యామ్ కాలువ మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈచెరువులు, చెక్‌డ్యామ్‌ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఓఎన్‌ఎం పథకంలో రూ.11లక్షలు విడుదల
చౌడుపల్లి చెరువు, తాజంగి జలాశయం దిగువనున్న బలభద్రం కాలువ అభివృద్ధికి ఆపరేషన్ అండ్ మెంటేనెన్స్(ఓఎన్‌ఎం) పథకం ద్వారా 11 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు విడుదలయ్యాయి. చౌడుపల్లి చెరువు విస్తీర్ణం 7.5 ఎకరాలు కాగా పూడికతో నిండిపోవడంతో 1.5ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో పంట పొలాలకు సాగు నీరు అందడంలేదు. చెరువులో పూడిక తొలగించేందుకు రూ.8.75 లక్షలు మంజూరు చేశారు. ఈ చెరువులో పూడికతీత పనులు పది రోజుల్లో ప్రారంభించనున్నారు. బలభద్రం కాలువకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.25లక్షలు కేటాయించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు. చౌడుపల్లి, అంతర్ల, సిరిపురం చెరువులు, తాజంగి జలాశయం కాలువల గేట్లు మరమ్మతులకు రూ.15లక్షలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పంపించారు.
నెలరోజుల్లో సాగునీటి వనరుల మరమ్మతులు పూర్తి
డి. లోకేశ్ కుమార్, ఏఈఈ, చింతపల్లి.
జలధారలో చెక్‌డ్యామ్, చెరువులు, జలాశయాల మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశాం. జూలై ఏడు నాటికి పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందుతుంది.