Share News

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:47 AM

ఎల్‌వినో ప్రభావంతో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొని బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో వరద నీరు చేరలేదని, అందువల్ల ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆంధ్రా, ఒడిశా అధికారులు తీర్మానించారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి
చిత్రకొండ ఓహెచ్‌పీసీ కార్యాలయంలో సమావేశమైన ఆంధ్రా, ఒడిశా అధికారులు

ఆంధ్రా, ఒడిశా అధికారుల తీర్మానం

బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో 57.1739 టీఎంసీల నీరు

ఏపీకి 40.7168 టీఎంసీలుగా, ఒడిశాకు 16.4571 టీఎంసీలు కేటాయింపు

సీలేరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌వినో ప్రభావంతో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొని బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో వరద నీరు చేరలేదని, అందువల్ల ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆంధ్రా, ఒడిశా అధికారులు తీర్మానించారు. బలిమెల జలాశయంలో నీటి నిల్వలు, రానున్న నెల రోజుల్లో నీటి వినియోగంపై ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఓహెచ్‌పీసీ కార్యాలయంలో గురువారం రెండు రాష్ట్రాల అదికారులు సమావేశమయ్యారు. 2026-27 నీటి సంవత్సరంలో ఇంతవరకు ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకున్నదీ లెక్కలు కట్టారు. ప్రస్తుతం బలిమెలలో 33.91 టీఎంసీలు, జోలాపుట్టులో 17.2639 టీఎంసీల నీరు వుంది. ఈ నెలాఖరునాటికి బలిమెలలోకి 4.5 టీఎంసీలు, జోలాపుట్టులోకి 1.5 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. దీంతో రెండు జలాశయాల్లో 57.1739 టీఎంసీల నీరు వుంటుందని లెక్కలు వేశారు. అలాగే 2025-26 నీటి సంవత్సరంలో ఆంధ్రా కంటే ఒడిశా 22.6865 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుందని, ఇక 2026-27 నీటి సంవత్సరంలో జూలై, ఆగస్టు నెలల్లో ఏపీ 4.7323 టీఎంసీలు, ఒడిశా 6.3054 టీఎంసీలు వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. 2025-26లో ఒడిశా అధికంగా వినియోగించుకున్న 22.6865 టీఎంసీలతో కలిపి ఇప్పటి వరకు 24.2596 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో ఉన్న 57.1739 టీఎంసీల నీటిలో ఏపీకి 40.7168 టీఎంసీలు, ఒడిశాకు 16.4571 టీఎంసీలు వాటా వున్నట్టు లెక్కలు కట్టారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి, ఇరిగేషన్‌, తాగునీటి అవసరాల నిమిత్తంగా ఒడిశా 1,200 క్యూసెక్కులు, ఆంధ్రా 6,000 క్యూసెక్కులు వినియోగించుకోవాడానికి ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఆంధ్రా తరుపున సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, ఈఈ టి.అప్పలనాయుడు, ఏఈఈ సీహెచ్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:47 AM