నగరంలో నీటి ఎద్దడి
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:10 AM
నగరంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి.
పలు ప్రాంతాల్లో ఎండిపోయిన బోర్లు
గ్రూప్ హౌస్‌లలో నీటి వినియోగంపై ఆంక్షలు
రోజుకు గంటన్నర మాత్రమే సరఫరా
అపార్టుమెంట్లలోనూ అంతే...
ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాల్సిన పరిస్థితి
ఒక్కో ఫ్లాట్ యజమానికి రోజుకు
రూ.100 నుంచి రూ.150 అదనపు వ్యయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి. వేసవి ముగిసి నైరుతుపవనాలు వచ్చినా వర్షాలు పెద్దగా పడడం లేదు. ఎల్‌నినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. దీంతో బోర్ల నీటిపై ఆధారపడిన గ్రూపు హౌసులు, అపార్టుమెంట్లలో ఉంటున్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్ల నీటిపై ఆధారపడుతున్నారు.
నగరంలో మద్దిలపాలెం, ఇసుకతోట, ఆరిలోవ, హనుమంతవాక, వన్‌టౌన్, అక్కయ్యపాలెం, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, ఎన్‌ఏడీ, కంచరపాలెం, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది...ఇలా అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. నాలుగు గంటలు విరామం ఇచ్చి బోర్ ఆన్ చేస్తే పావుగంట మాత్రమే నీరు వస్తోంది. అలా రోజుకు ఆరుసార్లు వేస్తే...మొత్తమ్మీద గంటన్నర మాత్రమే నీరు వస్తోంది. ఇది వారి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు.
బోర్‌తో పాటు జీవీఎంసీ నీటి కనెక్షన్ ఉండడంతో వ్యక్తిగత గృహాలకు పెద్దగా ఇబ్బంది లేదు. అదే గ్రూపు హౌస్‌ల్లో అయితే ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే పైన ట్యాంకర్ నుంచి ఫ్లాట్లకు నీరు ఇస్తున్నారు. అపార్టుమెంట్లలో అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు నీటిని తెప్పించుకుంటున్నారు. దీనికి అయ్యే ఖర్చు కోసం ప్రతి ఫ్లాట్ నుంచి అదనపు మొత్తం వసూలు చేస్తున్నారు. ఇది ప్రతి నెలా ఇచ్చే మెయింటెనెన్స్‌కు అదనం. రోజుకు ఎలా లేదన్నా ప్రతి ఫ్లాట్‌కు రూ.100 నుంచి రూ.150 రోజూ వెచ్చించాల్సి వస్తోంది.
జీవీఎంసీ నుంచి సరఫరా
జీవీఎంసీ అధికారులు నగరంలో టీఎస్‌ఆర్ కాంప్లెక్స్, ఎండాడ, మాధవధార, తదితర ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా ట్యాంకర్ల నీటిని విక్రయిస్తున్నారు. కిలో లీటరుకు రూ.90 చొప్పున చలానా కడితే ట్యాంకర్లకు నీటిని ఇస్తారు. ఆటోలకు కిలో లీటరు, చిన్న ట్యాంకర్లకు 2 కిలోలీటర్లు, 6 కిలోలీటర్ల చొప్పున నీటిని ఇస్తున్నారు. వీటిని ఆ డ్రైవర్లు/యజమానులు బయటకు తీసుకువెళ్లి అవసరమైన వారికి డిమాండ్ దూరాన్ని బట్టి అమ్ముకుంటున్నారు. రవాణా చార్జీలు అన్నీ కలుపుకొని లాభానికి విక్రయిస్తున్నారు. ఈ ధరలపై ఎవరికీ నియంత్రణ లేదు. డిమాండ్‌ను బట్టి 6 కిలోలీటర్ల ట్యాంకర్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అమ్ముకుంటున్నారు.
ప్రైవేటు బోర్ల దందా
నగరంలో నీటిఎద్దడిని దృష్టిలో ఉంచుకొని శివారు ప్రాంతాల్లో కొందరు బోర్లను ప్రత్యేకంగా తవ్వి, నీటిని అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ బోర్ల నీటిని కూడా ఇదేవిధంగా విక్రయిస్తున్నారు. అవి 10 కిలోలీటర్లు, 20 కిలోలీటర్ల చొప్పున వస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో 20 కిలోలీటర్ల ట్యాంకర్‌కు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు.
ఒక్క రోజే 341 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
పల్లంరాజు, ఎస్‌ఈ, జీవీఎంసీ
నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని వచ్చిన ఆటోలు, ట్యాంకర్లకు అన్నింటికి నీటిని అందిస్తున్నాం. నగరంలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో శుక్రవారం ఒక్కరోజే 341 వాహనాల ద్వారా నీటిని సరఫరా చేశాం. కిలోలీటరు ఆటోలు 150, 2 కిలోలీటర్ల ట్యాంకర్లు 97, ఆరు కిలోలీటర్ల ట్యాంకర్లు 94 నీటిని తీసుకువెళ్లాయి.