ఉత్తరాంధ్రకు నీటి భద్రత
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:49 AM
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక అమలు నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన నీటి నిల్వపై ప్రభుత్వం దృష్టిసారించింది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి నేపథ్యంలో ప్రభుత్వం ముందుచూపు
2047కల్లా ప్రజలు, పరిశ్రమలకు కావల్సిన నీటిపై లెక్కలు
అవసరాలకు నదులు, చెరువులు, పోలవరం ఎడమ కాలువ ద్వారా సేకరణ
డీశాలినేషన్ ద్వారా కొంత...
అర్బన్ చాలెంజడ్ ఫండ్ నుంచి నిధుల సమీకరణ
రేపటి నుంచి నగరంలో ఆరు జిల్లాల అధికారులతో మూడు రోజుల సదస్సు
సీఎం హాజరయ్యే అవకాశం?
విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక అమలు నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన నీటి నిల్వపై ప్రభుత్వం దృష్టిసారించింది. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకూ ఆరు జిల్లాలకు సంబంధించి సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో భాగంగా 2047 నాటికి ఆరు జిల్లాలకు అవసరమైన నీటి నిల్వల ఏర్పాటుకు కేంద్రం సగం నిధులు కేటాయించనున్నది. మిగిలిన నిధులు ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తాయి.
నీటి భద్రతా ప్రణాళిక అమలుకు సింగపూర్‌కు చెందిన సింగపూర్ యుటిలిటీ బోర్డు, ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిరకాల సహకారం అందించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల తొమ్మిదో తేదీ నుంచి నగరంలోని నోవాటెల్ హోటల్‌లో మూడు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలిరోజు సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని, అయితే ఆయన పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.
పరిశ్రమల రాకతో పెరగనున్న జనాభా
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్లాన్ అమలుతో ఉత్తరాంధ్రకు ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్‌ప్లాంటు, పలు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, మెగా పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇతర పారిశ్రామిక సంస్థలు రానున్నాయి. దాంతో ఉపాధి, అందుకు అనుగుణంగా జనాభా పెరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు, పరిశ్రమలకు 2047 నాటికి ఎంత నీరు అవసరమనేది ఈ సదస్సులో చర్చించి ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందులో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు, జల వనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు, విస్కో, స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌లను నీటి నిల్వల సామర్థ్యం పెంచే ప్రణాళికలో భాగస్వామ్యం చేస్తారు.
అందుబాటులో ఉన్న వనరులు
ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా, చంపావతి, సువర్ణముఖి, వేగావతి, శారద, తాండవ, గోస్తనీ, వరాహ నదులు, చెరువులు, వాగుల ద్వారా వచ్చే నీటి లభ్యత ఎంత అనేది జల వనరుల శాఖ నుంచి లెక్కలు సేకరించనున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి ఎంత నీటిని తీసుకోవాలి?, దాంట్లో సాగునీటి అవసరాలకు ఎంత అవసరం?, పరిశ్రమలు, ప్రజలకు ఎంత కేటాయించాలి?...అనేది చర్చించనున్నారు. వీటి ద్వారా 2047 నాటికి కావల్సిన నీటి లభ్యత సరిపోకపోతే సముద్ర నీటిని శుద్ధి చేసేలా డీశాలినేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తారు. అలాగే మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా మరికొంత నీటిని పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు.
జీవీఎంసీలో ప్రస్తుతం 25 లక్షల జనాభా ఉండగా, 453 ఎంఎల్‌డీ అవసరం కాగా 390 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే 2047కల్లా నగర ప్రజల అవసరాలకు 680 ఎంఎల్‌డీ, పరిశ్రమలకు 220 ఎంఎల్‌డీ నీరు, జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాలకు 15 ఎంఎల్‌డీ అవసరమని అంచనా వేస్తున్నారు.
భారీ నీటి ప్రణాళికలు అమలు చేయాలంటే అందుకుతగ్గ స్థాయిలో నిల్వలు కావాలి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని తీసుకునే క్రమంలో పాయకరావుపేట, ఎలమంచిలి, సబ్బవరం ప్రాంతాల్లో ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలి. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో పూడికతీత ద్వారా నిల్వ సామర్థ్యం పెంచాలి. ఉత్తరాంధ్రలో పెద్ద చెరువులను గుర్తించి పూడికతీసి గట్లు అభివృద్ధి చేయడం ద్వారా నిల్వలు పెంచుకోవచ్చు.
అర్బన్ ఛాలెంజ్‌డ్ ఫండ్
ఇందుకు ఎంత నిధులు అవసరమవుతాయనే దానిపై సదస్సులో ఒక అంచనాకు వస్తారు. రూ.లక్ష కోట్లతో కేంద్రం ఏర్పాటుచేసిన అర్బన్ ఛాలెంజ్‌డ్ ఫండ్ నుంచి 50 శాతం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. మరో 25 శాతం ప్రపంచబ్యాంకు నుంచి రుణం, మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
నీటి కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, కలెక్టర్, విశాఖపట్నం
విశాఖ నగరంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భవిష్యత్తు నీటి అవసరాల కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఇప్పటికే ప్రాథమికంగా సంబంధిత అఽధికారులతో సమావేశం నిర్వహించాం. పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపకల్పనకు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి నోవాటెల్ హోటల్‌లో మూడు రోజులపాటు సదస్సు జరగనున్నది. 2047నాటికి జనాభా, పారిశ్రామిక అవసరాల కోసం అవసరమైన నీటి సామర్థ్యం కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. పరిశ్రమలకు, పెరగనున్న జనాభాకు నీటి కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సదస్సుకు వచ్చే సింగపూర్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నగరంతోపాటు పరిసరాల్లో పర్యటిస్తారు.