నీటి ఎద్దడి
ABN , Publish Date - Aug 02 , 2026 | 01:25 AM
నగరంలో తాగునీటి కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న రిజర్వాయర్లు
గేట్ల మరమ్మతుల కోసం ఏలేరు నుంచి నీటి విడుదల నిలిపివేత
ప్రత్యామ్నాయంగా కాటేరు నుంచి పంపింగ్
అక్కడ విద్యుత్ సమస్యతో అంతరాయం
సరఫరాపై తీవ్ర ప్రభావం
కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా నిలిచిన నీటి సరఫరా
ప్రధాని సభ కోసం శనివారం సరఫరా నిలిపివేత
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో తాగునీటి కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిపోతుండడంతో సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇదే సమయంలో స్థానికంగా అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇబ్బందులను రెట్టింపు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నగరంలో వేసవి మాదిరి వాతావరణమే కొనసాగుతోంది. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు అడుగంటు తున్నాయి. కొన్నైతే డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. నగరానికి, పరిశ్రమలకు ప్రధాన నీటి వనరు ఏలేరు రిజర్వాయర్. అయితే గేట్ల మరమ్మతు కారణంగా అక్కడ నుంచి 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరానికి 90 ఎంజీడీల నీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. ఆ లోటును పూడ్చుకునేందుకు పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగర ప్రజల అవసరాల కోసం గోదావరి నది నుంచి కాటేరు వద్ద మోటార్లతో పంపింగ్ చేసి 45 ఎంజీడీల నీటిని తరలించడం ప్రారంభించారు. అయితే విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు కారణంగా మోటార్లు పాడవ్వడంతో గత రెండు రోజుల్లో 30 గంటలపాటు పంపింగ్ నిలిచిపోయింది. తర్వాత మోటార్ల సమస్యను పరిష్కరించి పంపింగ్ ప్రారంభించినప్పటికీ అక్కడి నుంచి నీరు నగరానికి చేరాలంటే కనీసం రెండు రోజలు పడుతుంది. ఆదివారం నాటికి నగరానికి కాటేరు నీరు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నగరంలో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఆరిలోవ, బాలాజీనగర్, కొమ్మాది, గొల్లల ఎండాడ, మద్దిలపాలెం, శివాజీపాలెం వంటి ప్రాంతాలకు గత రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
మరోవైపు నగరంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అపార్టుమెంట్‌లు, నివాసాల్లోని బోర్లు పనిచేయడం లేదు. దీంతో వారంతా ఇంటి అవసరాలకు కూడా కొళాయి నీటిపైనే ఆధారపడుతుండడంతో నగరంలో సరఫరాపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. అది కూడా గతంలో 45 నిమిషాలు వచ్చిన కొళాయిలు...ఇప్పుడు పది నిమిషాలు దాటి రావడం లేదు.
ప్రధాని సభ కోసం నీటి సరఫరా బంద్
ఇప్పటికే కొళాయిలు సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు జీవీఎంసీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మింగుడుపడడం లేదు. ఉదయాన్నే కొళాయిలు ఇస్తే మహిళలంతా నీరు పట్టుకునే పనిలో ఉండిపోయి భోగాపురంలో ప్రధాని సభకు రారేమోనని అధికారులు శనివారం ఉదయం నీటి సరఫరాను నిలిపివేశారు. కొళాయిలు రాకపోతే సభకు వస్తారనేది అధికారుల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నగరవాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని సభ కోసం ప్రజలు తాగునీరు లేకుండా ఇబ్బందిపడాలా?...అని ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్లేది ఎంతమంది? వారి కోసం 25 లక్షల మందికి తాగునీరు లేకుండా చేస్తారా?..అని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన అధికారులు శనివారం సాయంత్రం అక్కయ్యపాలెం, సీతంపేట, సీతమ్మధార, రామ్‌నగర్ వంటి కొన్ని ప్రాంతాలకు కొళాయి నీటి సరఫరా చేయడం విశేషం.