నీటి ఎద్దడి
ABN , Publish Date - May 02 , 2026 | 01:09 AM
నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లన్నింటిలోనూ పుష్కలంగా నిల్వలు ఉన్నాయి.
రిజర్వాయర్లలో పుష్కలంగా నిల్వలు
నగరంలో మాత్రం తాగునీటికి వెతలు
ట్యాంకర్లతో కొనుక్కుంటున్న ప్రజలు
అపార్టుమెంట్‌లలో సమస్య మరింత తీవ్రం
తాము సరఫరా తగ్గించలేదంటున్న జీవీఎంసీ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లన్నింటిలోనూ పుష్కలంగా నిల్వలు ఉన్నాయి. కానీ నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కొళాయి ద్వారా సరిగా సరఫరా తగ్గిపోవడంతో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి సంపుల్లో భద్రపరుచుకుంటున్నారు. కొండవాలు ప్రాంతాల్లో అయితే కొన్నిచోట్ల రోజు విడిచి రోజు కొళాయిలు ద్వారా నీరు ఇస్తున్నారు. కానీ, తాము గతంలో మాదిరిగానే సరఫరా చేస్తున్నామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో గల సుమారు 25 లక్షల మంది జనాభాకు తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 90 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి 41.5 ఎంజీడీ, రైవాడ నుంచి 13.28 ఎంజీడీ, తాటిపూడి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లతో పాటు గోస్తనీ, గోదావరి నదుల్లో తవ్విన ఫిల్టర్ పాయింట్ల నుంచి మిగిలిన నీటిని తీసుకుంటున్నామంటున్నారు. ఇదే స్థాయిలో చాలాకాలంగా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ వేసవి సీజన్ ప్రారంభమైన తర్వాత గత 15 రోజులుగా నీటి కష్టాలు మొదలయ్యాయి. శివాజీపాలెం, ఆరిలోవ, కేఆర్‌ఎం కాలనీ, ఫేకర్ లేఅవుట్, అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్ వంటి ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అపార్టుమెంట్‌లలో నివాసం ఉండేవారు అవసరానికి తగిన నీటి సరఫరా జరగకపోవడంతో ట్యాంకర్లతో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరిలోవ, శివశక్తినగర్, కొమ్మాది, వేపగుంట వంటి కొండవాలు ప్రాంతాల్లో కొళాయిల ద్వారా నీటి సరఫరా రోజు విడిచి రోజు జరుగుతోంది. దీంతో ప్రజలు తాగునీటి కోసం కొళాయిలు వచ్చేవరకు పనులకు వెళ్లకుండా బిందెలతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరానికి నీటిని అందిస్తున్న ప్రధాన రిజర్వాయర్లలో నిల్వలు వేసవి సీజన్ దాటేంత వరకూ సరిపడినంతగా ఉన్నప్పటికీ సరఫరాలో సమస్యలు తలెత్తడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కనిష్ఠ స్థాయి నీటిమట్టం 71.5 మీటర్లు కాగా ప్రస్తుతం 78.79 మీటర్ల మేర నీరు ఉంది. రైవాడ, తాటిపూడి, మిగిలిన రిజర్వాయర్లలో నిల్వలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు కనీసం రెండు, మూడు నెలల వరకు సరిపోతాయి. జూన్ తర్వాత వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితిలో నగరంలో తాగునీటి సరఫరా గతంలో ఎలా ఉందో అదే మాదిరిగా జరగాలి. కానీ గత పదిహేను రోజులుగా నగరంలో కొన్నిప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తడంతో ప్రజలు ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.
భూగర్బ జలాలు అడుగంటడంతోనే సమస్యకు కారణం
నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, అదే సమస్యకు కారణంగా మారిందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అపార్టుమెంట్లు, ఇళ్లలోని బోర్‌ల నుంచి నీరు రాకపోవడంతో ప్రజలు రోజువారీ అవసరాలకు సైతం కొళాయి నీటినే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కొళాయిల ద్వారా గతంలో మాదిరిగా 45 నిమిషాలు నుంచి గంట సేపు నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ప్రజలు తమ అవసరాల కోసం ఇంకా అదనపు నీటిని ఆశిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పల్లపు ప్రాంతాల్లో కొళాయి నీటి వాడకం నిరంతరాయంగా జరుగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లో సరఫరాపై ప్రభావం చూపుతోందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగానే నీటి సరఫరా జరుగుతోందని, రిజర్వాయర్లలో నిల్వలు సమృద్ధిగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు కొళాయి ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్లే వృథా జరిగి సమస్యలు తలెత్తుతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు. వేసవి నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై నీటి సరఫరాలో ఇబ్బందులకు తావులేకుండా పైప్‌లైన్‌లను తనిఖీ చేయడం, లీకేజీలు అరికట్టడం, రిజర్వాయర్లలో పంప్‌హౌస్‌లు సక్రమంగా పనిచేసేలా చూడడం చేయాలని కోరుతున్నారు.