Share News

పెద్ద దిక్కులేని జలవనరులు

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:46 AM

అనకాపల్లి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడి నాలుగేళ్లు దాటినా.. జలవనరుల శాఖకు అనకాపల్లిలో పూర్తిస్థాయి జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ఈ శాఖకు సంబంధించి కీలక పనుల కోసం రైతులు ఇప్పటికీ చోడవరం లేదా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు.

పెద్ద దిక్కులేని జలవనరులు
అనకాపల్లిలో జలవనరుల శాఖ సబ్‌ డివిజన్‌ కార్యాలయం

జిల్లా కేంద్రంలో ఇంతవరకు ఏర్పాటు కాని ఎస్‌ఈ కార్యాలయం

నర్సీపట్నంలో ఈఈ ఆఫీస్‌.. మూడేళ్ల నుంచి పోస్టు ఖాళీ

ఇన్‌చార్జిగా చోడవరం వాటర్‌షెడ్‌ ఈఈ

జిల్లా కేంద్రంలో డీఈ స్థాయి అధికారికే పరిమితం

సాగునీటి వనరుల పనులపై కొరవడిన పర్యవేక్షణ

సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో రైతులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడి నాలుగేళ్లు దాటినా.. జలవనరుల శాఖకు అనకాపల్లిలో పూర్తిస్థాయి జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ఈ శాఖకు సంబంధించి కీలక పనుల కోసం రైతులు ఇప్పటికీ చోడవరం లేదా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు.

జిల్లాలో కాలువలు, చెరువులు, జలాశయాలు, గ్రోయిన్లు, ఆనకట్టలు, తదితర సాగునీటి వనరులకు సంబంధించి నిర్వహణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఆయా రైతులు, నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి కార్యాలయం లేకపోవడంతో సాగునీటి వనరుల సమస్యల పరిష్కారానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి సమస్య పరిష్కారానికి కూడా సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం సహా అనేక ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు అనకాపల్లిలో ఏర్పాటయ్యాయి. అయితే జలవనరుల శాఖకు సంబంధించి జిల్లా స్థాయి పరిపాలనా వ్యవస్థ మాత్రం పూర్తిస్థాయిలో అనకాపల్లిలో పనిచేయడం లేదు. చోడవరంలోని వాటర్‌షెడ్‌ డివిజన్‌ ఈఈ త్రినాథం ప్రస్తుతం జిల్లా నీటి పారుదల అఽధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు మాత్రం ఆయన చుట్టం చూపుగా వచ్చి వెళుతున్నారు.

వాస్తవంగా జిల్లాల పునర్విభజన సమయంలోనే అనకాపల్లిలో జలవనరుల శాఖ జిల్లా కార్యాలయం ఏర్పాటు కావాలి. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు విశాఖలో జలవనరుల శాఖ సర్కిల్‌ (ఎస్‌ఈ హోదా కలిగిన అధికారి), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు నేతృత్వంలో డివిజన్‌ కార్యాలయం ఉన్నాయి. సర్కిల్‌ పరిధిలో విశాఖపట్నం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాడేరు డీఈ కార్యాలయాలు పనిచేసేవి. విశాఖలోని డీఈ కార్యాలయం పరిధిలో సబ్బవరం, పరవాడ, అనకాపల్లి, కశింకోట మండలాలు ఉన్నాయి. అనకాపల్లిలో ఏఈ హోదాతో ఉన్న సెక్షన్‌ కార్యాలయం మాత్రమే ఉంది. తరువాత చోడవరం కేంద్రంగా వాటర్‌షెడ్‌ డివిజన్‌, పాడేరులో చిన్ననీటి వనరుల డివిజన్‌ ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో విశాఖలోని డివిజన్‌ ( ఈఈ కేడర్‌ అధికారి) కార్యాలయం అనకాపల్లి జిల్లాకు తరలిపోవాలి. గత ప్రభుత్వంలో విశాఖలోని డివిజన్‌ కార్యాలయాన్ని నర్సీపట్నానికి తరలించారు. అనకాపల్లిలో కాకుండా నర్సీపట్నంలో ఏర్పాటు చేసినప్పటికీ అప్పట్లో ఎమ్మెల్యేలు, చివరకు కలెక్టర్‌ కూడా పట్టించుకోలేదనే వాదన ఉంది. జిల్లాల విభజన సమయంలో వైసీపీ ముఖ్య నేత సోదరుడు ఒకరు విశాఖ డివిజన్‌ కార్యాలయం ఈఈగా ఉండేవారు. అప్పటికే ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడంతో డివిజన్‌ కార్యాలయం నర్సీపట్నానికి తరలినప్పుడు అభ్యంతరం చెప్పలేదు. వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే వరకు (సుమారు ఏడాదిపాటు) తూతూమంత్రంగా నర్సీపట్నం వెళ్లారు. అప్పటి నుంచి ఇంత వరకు నర్సీపట్నంలో రెగ్యులర్‌ ఈఈని నియమించలేదు. దీంతో జిల్లా జలవనరుల శాఖాధికారిగా చోడవరంలోని వాటర్‌షెడ్‌ ఈఈ త్రినాథం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు తరువాత ఈఈ కేడర్‌ అధికారి లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని అప్పటి కలెక్టర్‌ గుర్తించారు. విశాఖలోని ఎస్‌ఈ కార్యాలయాన్ని అనకాపల్లికి తరలించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈలోగా ఆయన బదిలీ కావడంతో ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.

వసతి కొరత లేదు

అనకాపల్లిలో ఉడ్‌పేటలో జనవనరుల శాఖకు సొంత భవనం వుంది. కొద్దిపాటి మరమ్మతులు చేపట్టి దానిని జిల్లా కార్యాలయంగా వినియోగించుకునేందుకు అవకాశం వుంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఈ కార్యాలయం ఉంటే.. జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులు ఇక్కడకు వచ్చి, సాగునీటి వనరులకు సంబంధించి సమస్యలను చెప్పుకునే అవకాశం వుంటుంది. ప్రజాప్రతినిధులు సైతం సంబంధిత అధికారిని కలిసి తమ నియోజకవర్గం పరిధిలో సాగునీటి వనరుల అభివృద్ధి, మరమ్మతు, నిర్వహణ పనుల గురించి చర్చించే వెసులుబాటు కలుగుతుంది. అయితే అటు నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఈఈ కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, ఇన్‌చార్జిగా వున్న చోడవరం వాటర్‌షెడ్‌ ఈఈపై పనిభారం కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాగునీటి వనరుల పర్యవేక్షణ, పరిశీలన చేసేవారు లేకపోయారు. మరోవైపు అనకాపల్లిలోని జలవనరుల శాఖ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో జేఈ, ఇద్దరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు వున్నారు. వీరు రోజూ విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో క్షేత్రస్థాయిలో పనులపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని శాఖల జిల్లాస్థాయి కార్యాలయాలు అనకాపల్లిలో వున్నందున, అత్యంత ముఖ్యమైన జలవనరుల శాఖ జిల్లా కార్యాలయాన్ని కూడా అనకాపల్లిలో ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:46 AM