Share News

మత్స్యగెడ్డ వెలవెల

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:08 AM

మండలంలోని సుజనకోట, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు, లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల పరిధిలో మత్స్యగెడ్డ వెలవెలబోతున్నది. సుమారు నెలన్నర క్రితం వరకు మత్స్యగెడ్డ నిండు కుండను తలపించింది. అయితే రెండు నెలల నుంచి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, మరోవైపు మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తుండడంతో మత్స్యగెడ్డలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి.

 మత్స్యగెడ్డ వెలవెల
సుజనకోట సమీపంలో మత్స్యగెడ్డలో బాగా తగ్గిన నీటి నిల్వలు

వేసవికి ముందే తగ్గిపోతున్న నీటి నిల్వలు

భూగర్భ జలాలపై ప్రభావం

తాగునీటి సమస్య ఏర్పడుతుందని గిరిజనుల ఆందోళన

ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 19, (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుజనకోట, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు, లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల పరిధిలో మత్స్యగెడ్డ వెలవెలబోతున్నది. సుమారు నెలన్నర క్రితం వరకు మత్స్యగెడ్డ నిండు కుండను తలపించింది. అయితే రెండు నెలల నుంచి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, మరోవైపు మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తుండడంతో మత్స్యగెడ్డలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం అయినప్పటికీ మధ్యాహ్నపూట ఎండ ఠారెత్తిస్తున్నది. దీనివల్ల కొంతమేర నీరు ఆవిరవుతున్నది. వేసవి ప్రారంభానికి ముందే నీటి నిల్వలు తగ్గుతుండడంతో గ్రామాల్లో భూగర్భ జలాలు మరింత దిగజారి, తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని పలు గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యగెడ్డలో నీటి నిల్వలు తగ్గిపోతుండంతో జోలాపుట్టు జలాశయం స్పిల్‌వే గేట్ల ద్వారా డుడుమ జలాశయానికి (మాచ్‌ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు) నీటి విడుదల జరగని పరిస్థితి నెలకొంటున్నది. దీంతో డ్యామ్‌ రివర్‌ స్లూయిస్‌ ద్వారా నీటిని విడుదల చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి వేసవి వర్షాలు కురిస్తే మత్స్యగెడ్డలో కొత్త నీరు చేరుతుందని, లేకపోతే భూగర్భజలాలు మరింత దిగజారి, తాగునీటి సమస్య ఏర్పడుతుందని ఆయా గ్రామాల గిరిజనులు అంటున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:08 AM