గోదావరి డెల్టాకు నీరు విడుదల
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:32 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు గురువారం ఉదయం నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు.
డొంకరాయి జలాశయం నుంచి మూడు వేలు..
పొల్లూరులో విద్యుదుత్పత్తి ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కులు
ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు
సీలేరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు గురువారం ఉదయం నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గోదావరి డెల్టా ప్రాంతంలో ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన నీరు రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీలో లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు గోదావరి డెల్టాకు సీలేరు నుంచి నీటిని విడుదల చేయాలని జెన్‌కో ఉన్నతాధికారులను కోరారని తెలిపారు. ఈ మేరకు డొంకరాయి జలాశయం రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి లేకుండా నేరుగా గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నామన్నారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నామని, సీలేరు నుంచి మొత్తం ఏడు వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల అవుతుందన్నారు. ఈ నెల 25 వరకు డొంకరాయి నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలో బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 23.1414 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో 13 టీఎంసీలతో కలసి మొత్తం 36.1414 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, డొంకరాయి, సీలేరు మూడు జలవిద్యుత్ కేంద్రాల్లో 5 మిలియన్ యూనిట్ల నుంచి 6 మిలియన్ యూనిట్ల వరకు గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.