డొంకరాయి నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:01 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి సోమవారం రాత్రి గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు మూడు వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు విడుదల చేశారు.
గోదావరి డెల్టా ఖరీఫ్ పంటల కోసం ఈ నెల 27 వరకు కొనసాగింపు
సీలేరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి సోమవారం రాత్రి గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు మూడు వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు విడుదల చేశారు. గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సీలేరు కాంప్లెక్సు నుంచి 7 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని జెన్‌కో ఉన్నతాధికారులను ఇరిగేషన్ అధికారులు కోరారు. ఈ మేరకు గోదావరి డెల్టాకు నీరు విడుదల చేయాలని సీలేరు కాంప్లెక్సు అధికారులను జోన్‌కో ఉన్నతాధికారులు ఆదేశించారు. సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి డొంకరాయి జలాశయం ఆరు, ఏడు నంబర్లు గల రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ(మెకానికల్) భీమవరపు బాలకృష్ణ మాట్లాడుతూ సీలేరు నుంచి ఏడు వేల క్యూసెక్కులు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 4 వేల క్యూసెక్కులు, డొంకరాయి జలాశయం నుంచి విద్యుదుత్పత్తి లేకుండా నేరుగా మరో మూడు వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా ఏడు వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నామన్నారు. ఈ నెల 27 వరకు ఈ నీటి విడుదల కొనసాగుతుందని, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 4 మిలియన్ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆయన తెలిపారు.