కొనసాగుతున్న బలిమెలకు నీటి విడుదల
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:00 PM
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నుంచి బలిమెల జలాశయానికి నీటి విడుదల కొనసాగుతున్నది.
ముంచంగిపుట్టు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నుంచి బలిమెల జలాశయానికి నీటి విడుదల కొనసాగుతున్నది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. దీంతో ఆయా జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. డుడుమ జలాశయంలో 2,590 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ఆదివారం 2,587.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఈ జలాశయం నుంచి దిగువ ప్రాంతంలో గల బలిమెలకు ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే డుడుమకు ఎగువ ప్రాంతంలో ఉన్న జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంగా ఉండగా, ప్రస్తుతం 2,746.65 అడుగుల నీటిమట్టం నమోదైంది. నీటి నిల్వలు నిలకడగా ఉండడం వలన ఇక్కడ నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.