నీటి నాణ్యత అంతంతమాత్రం
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:53 AM
విశాఖపట్నంలో భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటిపోతున్నాయి.
కొత్త జాలరిపేట నుంచి భీమిలి వరకు భూగర్భ జలాలపై ‘గీతం’ ఆచార్యుల అధ్యయనం
15 ప్రాంతాల్లో పరీక్షలు
సాగర్‌నగర్, శివగణేశ్‌నగర్, జోడుగుళ్లపాలెం, ప్రభుత్వ గురుకులం ప్రాంతాల్లో తాగడానికి పనికిరానట్టుగా నీరు
ఆందోళనకర స్థాయిలో ఫ్లోరైడ్
పాండురంగస్వామి ఆలయం పరిసరాలు, పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెం ప్రాంతాల్లో మోతాదుకు మించి మాంగనీస్
భీమిలి, కొత్తూరు, ఎర్నిమాంబ ఆలయం, తిమ్మాపురాల్లో సముద్రపు నీరు చొరబాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటిపోతున్నాయి. నిత్యావసరాలకు నీరు లభించడం లేదు. వ్యక్తిగత గృహాల నుంచి గేటెడ్ కమ్యూనిటీల వరకూ 70 నుంచి 80 శాతం ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడుతున్నారు. జీవీఎంసీ అరకొరగా ట్యాంకర్లతో సరఫరా చేస్తోంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడానికి చాలామంది వ్యవసాయ బోర్లు, చెరువుల నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతోంది. చర్మవ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మోకాళ్ల కింద కొందరికి దురదలు వస్తున్నాయి. ఇవన్నీ నాణానికి ఒక వైపు అయితే గీతం అధ్యాపక బృందం నిర్వహించిన అధ్యయనంలో మరికొన్ని కఠినమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీరం పొడవున ఉన్న జనావాసాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొని వస్తోంది. అక్కడి భూగర్భ జలాల్లో సెలినిటీ (లవణీయత-ఉప్పు) కనిపిస్తోంది. నాలుగు ప్రాంతాల్లో భూగర్భ జలాలు (బోరు నీరు) వాడకానికి హానికరమని ఆ అధ్యయనం తేల్చిచెప్పింది.
విశాఖపట్నంలో కొత్తజాలరిపేట నుంచి భీమునిపట్నం వరకు 26 కి.మీ. పొడవున 15 ప్రాంతాల్లో బోరు బావుల ద్వారా భూగర్భ జలాలపై గీతం బృందం అధ్యయనం చేసింది. గత ఏడాది రుతుపవనాల సీజన్‌కు ముందు అంటే మే నెలలో ఒకసారి, నవంబరులో ఒకసారి అక్కడి నీటిపై భౌతిక, రసాయన పరీక్షలు నిర్వహించింది. ప్రధానంగా మూడు రకాల పరీక్షలు నిర్వహించారు. వాటర్ క్వాలిటీ ఇండెక్స్ (నీటి నాణ్యత), రెవెల్లే ఇండెక్స్ (సముద్రపు నీటి ప్రభావ ం), లాంగెలియర్ శాచురేషన్ ఇండెక్స్ (నీటి ఉష్ణోగ్రత, హార్డ్‌నెస్, ఆల్కనిటీ, టీడీఎస్ వంటి పరీక్షలను పరీక్షించారు. భూగర్భ జలాలు అధికంగా తోడేయడం వల్ల సముద్రపు నీరు చొచ్చుకు వస్తోందని, పారిశ్రామిక వ్యవహారాలు అధికం కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు హానికరంగా, వాడకానికి పనికిరానివిగా మారాయని తేల్చారు.
ఆ నాలుగు ప్రాంతాల నీరు ప్రమాదకరం
శివగణేశ్‌నగర్, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్, ప్రభుత్వ బాలికల గురుకులం ప్రాంతాల్లో భూగర్భ జలాలు రెండు కాలాల్లోను (అంటే మే, నవంబరు) తాగడానికి పనికిరాని విధంగా ఉన్నట్టు తేలింది. సాగర్‌నగర్‌లో నీటి నాణ్యత వర్షాకాలానికి ముందు 143 కాగా నవంబరులో 134.9గా నమోదైంది. శివగణేశ్‌నగర్‌లో 125, 121గా, ప్రభుత్వ బాలికల గురుకులంలో 106.6, 102.9 గా నమోదయ్యాయి. జోడుగుళ్లపాలెంలో ముందు 100.2, ఆ తరువాత 100.3గా రికార్డు అయింది. నీటి నాణ్యత ఇండెక్స్ 100 దాటకూడదు. దాటితే అది తాగడానికి పనికి రాదు. తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రావడాన్ని రెవెల్లె ఇండెక్స్ (ఆర్‌ఐ) సూచిస్తుంది. ఇది 0.5 కంటే తక్కువ ఉండాలి. కొత్తూరు, భీమిలి, ఎర్నిమాంబ ఆలయం, తిమ్మాపురాల్లో ఆర్‌ఐ విలువలు ఒకటి కంటే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తూరులో అత్యధికంగా 2.16 రికార్డు అయింది.
- శివగణేశ్ నగర్, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్, బాలికల గురుకులంలో ఫ్లోరైడ్ కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. పాండురంగస్వామి ఆలయం, పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెంలో మాంగనీస్ మోతాదు అధికంగా ఉంది.
- గీతం యూనివర్సిటీకి చెందిన ఆచార్యులు బుద్ధా రవిప్రసాద్, కాకర్ల జగదీశ్వరరావు, నండూరి శ్రీనివాస్, కొల్లి సురేశ్‌కుమార్‌లు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. ఈ నివేదికను రీసెర్చి జర్నల్ ఆఫ్ కెమిసీ్ట్ర అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఇటీవల ప్రచురించారు.