జలమా... గరళమా?
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:53 AM
జిల్లాలోని ఆర్వోప్లాంట్స్ నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆర్వో ప్లాంట్స్ విక్రయించే నీటిని కొనుగోలుచేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలకు దూరంగా ఆర్వో ప్లాంట్స్
మినరల్ వాటర్ పేరుతో కలుషిత నీరు విక్రయం
ఆహార భద్రత, ప్రమాణాలశాఖ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి
రెండు ఆర్వో ప్లాంట్స్ నీటిలో కోలీఫామ్ అనే బాక్టీరియా గుర్తింపు
జిల్లాలో ఇలాంటి ప్లాంటు మరెన్నో?
విశాఖపట్నం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఆర్వోప్లాంట్స్ నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆర్వో ప్లాంట్స్ విక్రయించే నీటిని కొనుగోలుచేస్తున్నారు. అనేక చోట్ల ఆర్వోప్లాంట్స్ నిర్వాహకులు అపరిశుభ్రమైన, బాక్టీరియాతో కూడిన నీటిని విక్రయించి, సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల ఆహార భద్రత ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది.
నగర పరిధిలోని భూపేష్‌నగర్, జ్ఞానాపురం ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు విస్తుగొలిపే వాస్తవలు వెల్లడయ్యాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో ప్లాంట్స్ నిర్వహించడంతోపాటు శుద్ధి చేసినవిగా చెబుతున్న నీటిలో కోలీఫామ్ అనే బాక్టీరియా ఉన్నట్టు తేల్చారు. దీంతో ఈ రెండు ప్లాంట్స్‌ను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధించారు. ఆర్వో ప్లాంట్స్‌ను పర్యవేక్షించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో ప్రజలకు కలుషిత నీటిని విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు..
జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఆర్వోప్లాంట్లు ఏర్పాటుచేశారు. అనేక ప్లాంట్లకు అనుమతులు కూడా లేవు, నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడంతో జనం అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించగా కోలీఫామ్ అనే బాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు అనేకచోట్ల ఈ కోలి, సాల్మోనెల్లా, షిగ్మెల్లా, ఎంటెరోకోక్కై వంటి బాక్టీరియాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆర్వో ప్లాంట్స్ నిర్వహణ సరిగా లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రధానంగా ఆర్వో మేంబ్రేన్, ఫిల్టర్లను మార్చకపోవడం, యూవీ లేదా ఓజోన్ శుద్ధి వ్యవస్థ పనిచేయకపోవడం, స్టోరేజ్ ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపుల్లో బయోఫిల్మ్ ఏర్పడడం, ముడి నీరు అధికంగా కలుషితం కావడం వల్ల నీటిలో బాక్టీరియాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు. ఈ బాక్టీరియాతో ఉన్న నీటిని తాగితే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డీహైడ్రేషన్, టైఫాయిడ్, ఇతర సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్వో ప్లాంట్స్‌లో తెచ్చిన నీరు రుచి మారినా, వాసన వచ్చినా అప్రమత్తం కావాలని, అటువంటి నీటిని తాగితే డయేరియా, వాంతులు, కడుపు నొప్పి వేధిస్తాయని చెబుతున్నారు.