Share News

జల్‌ జీవన్‌కు జీవం

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:52 PM

గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలో అసంపూర్తిగా వున్న తాగునీటి పథకాల పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో కొత్తగా మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లు, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల నిర్మాణం జరగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి పలు అంశాలకు ఆమోద ముద్ర వేశారు. దీంతో జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద గతంలో మొదలుపెట్టి, నత్తనడకన సాగుతున్న పనులు వేగం పుంజుకోనున్నాయి.

జల్‌ జీవన్‌కు జీవం
బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామంలో కొత్తగా నిర్మించిన తాగునీటి ట్యాంకు

పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అసంపూర్తి పనులు పునఃప్రారంభానికి మార్గం సుగమం

కొత్తగా మల్టీ విలేజ్‌ స్కీమ్‌లు, వాటర్‌ గ్రిడ్‌లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలో అసంపూర్తిగా వున్న తాగునీటి పథకాల పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో కొత్తగా మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లు, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల నిర్మాణం జరగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి పలు అంశాలకు ఆమోద ముద్ర వేశారు. దీంతో జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద గతంలో మొదలుపెట్టి, నత్తనడకన సాగుతున్న పనులు వేగం పుంజుకోనున్నాయి.

జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15న ప్రారంభించింది. అన్ని గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల ద్వారా ఇంటింటికి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇంకా అవసరమైనచోట కొత్తగా నీటి ట్యాంకుల నిర్మాణం, కొళాయి కనెక్షన్ల కోసం పైపులైన్ల ఏర్పాటు వంటి పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వుంది. మొదటి దశ పనుల ప్రారంభంలో జాప్యం, కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా వరకు పనులు మందకొడిగా సాగాయి. తరువాత 2023లో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రెండో దశ కింద రూ.69 కోట్ల అంచనా వ్యయంతో 1,869 పనులు మంజూరయ్యాయి. నిధుల కొరత, మొదటి దశలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మొత్తం మీద 1,202 పూర్తిచేయగా, 667 పనులు వివిధ దశల్లో వున్నాయి. పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.8.15 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో మిగిలిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4.17 లక్షల కుటుంబాలు ఉండగా జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ఇప్పటి వరకు 3.07 లక్షల కుటుంబాలకు ఇంటింటి కొళాయి కనెక్షన్‌లు అందించారు. ఇంకా 1.16 లక్షల కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద అసంపూర్తిగా వున్న పనులను త్వరగా పూర్తిచేయడంతోపాటు కొత్తగా మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లు, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అవసరమైనచోట కొత్తగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, ఇప్పటికే వున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు కొత్త ట్యాంకులను అనుసంధానం చేయడం, మిగిలిన అన్ని ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తే.. పనులను పునరుద్ధరించడానికి, కొత్త పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు సుముఖంగా వున్నారు.

మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లు

ప్రతి గ్రామానికి ఒక తాగునీటి పథకం (బోరు, మోటారు, వాటర్‌ ట్యాంకు, పైపులైన్లు, కొళాయిలు) కాకుండా పలు గ్రామాలకు కలిపి మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌ పేరుతో ఒక తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేస్తే నీటి సమస్య వుండదని, నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అదే విధంగా వాటర్‌ గ్రిడ్‌ల ఏర్పాటుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నదులు, గెడ్డల్లో ఇన్‌వెల్‌ బోర్లు వేస్తారు. రిజర్వాయర్ల నుంచి నేరుగా నీటిని తీసుకుంటారు. ఆయా ప్రదేశాల వద్ద ఫిల్టర్‌ బెడ్‌లు, గ్రౌండ్‌ ట్యాంకులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి, శుద్ధి చేసిన నీటిని పైపులైన్ల ద్వారా ఆయా గ్రామాల్లో ఇప్పటికే వున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేస్తారు. వీటిని నుంచి కొళాయిలకు సరఫరా చేస్తారు. అవసరమైనచోట కొత్తగా ఓవర్‌హెచ్‌ ట్యాంకులు కూడా నిర్మిస్తారు. మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌ ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని, ఏడాది పొడవునా నిరాటంకంగా రక్షిత తాగునీరు సరఫరా అవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మల్టీ విలేజ్‌ స్కీమ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపామని ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ జె.అనిల్‌కుమార్‌ తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Updated Date - Jul 14 , 2026 | 11:52 PM