Share News

పాతాళంలోకి నీరు

ABN , Publish Date - May 29 , 2026 | 12:41 AM

వినియోగం భారీగా పెరుగుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి.

పాతాళంలోకి నీరు

పడిపోతున్న భూగర్భ జలాలు

ఎండాడలో ప్రమాద ఘంటికలు

28.9 మీటర్ల లోతులో జలాలు

పెదరుషికొండ, మధురవాడ, ఆరిలోవల్లోనూ అదే పరిస్థితి

అడుగంటుతున్న బోర్లు

కొన్ని ప్రాంతాల్లో నీటితో పాటు తెల్లటి మట్టి రాక

వర్షాలు ఆలస్యమైతే నగరంలో నీటికి కటకటే

పొదుపు పాటించకుంటే భవిష్యత్తులో కష్టాలే

రీచార్జి వ్యవస్థను పక్కాగా ఏర్పాటుచేసుకోవాలి

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

వినియోగం భారీగా పెరుగుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఎండాడలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఎండాడలో భూగర్భ జల మట్టం ఏకంగా 28.9 మీటర్లకు పడిపోయింది. అక్కడ కొన్ని బోర్లు ఎండిపోయాయి. మిగిలిన వాటిల్లో నీటితోపాటు తెల్లటి (సుద్ద) మట్టి వస్తోంది. దీంతో ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. అలాగే పెదరుషికొండ, మధురవాడ, ఆరిలోవ ప్రాంతాల్లో కూడా నీరు అడుగంటిపోయింది. వర్షాలు ఆలస్యమైతే ఎండాడ, మధురవాడ, రుషికొండ, ఆరిలోవ, నగరంలోని పలు ప్రాంతాలు, గాజువాక, కణితి ప్రాంతాలు ప్రమాదంలో పడనున్నాయి.

జిల్లా భూగర్భ జల శాఖ ఏర్పాటుచేసిన పైజో మీటర్ల (భూగర్భ జల మట్టాన్ని కొలిచే పరికరం)లో మే నెల 24న నమోదైన వివరాలు పరిశీలిస్తే నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. జీవీఎంసీ సరఫరా చేస్తున్న నీరు తాగేందుకు, వంట అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇతర అవసరాలకు అంతా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అపార్టుమెంట్లు, గ్రూప్‌ హౌస్‌లతో పాటు వ్యక్తిగత గృహాల్లో కూడా బోర్లు వేస్తున్నారు. ఎండాడ, మధురవాడల్లో 400 అడుగులలోతు వరకు తవ్వుతున్నారు. అయితే వినియోగంపై నియంత్రణ లేకపోవడంతో ఎండాడలో భూగర్భ జలాలు 28.9 మీటర్లకు పడిపోయాయి. గత ఏడాది మే నెలలో ఎండాడలో 17.17 మీటర్ల లోతున జలాలు ఉండేవి. కేవలం ఏడాదిలో అంతకంటే 11.73 మీటర్ల కిందకు పడిపోయాయి. అదేవిధంగా ఆరిలోవలో 24.5 మీటర్లు, పెదరుషికొండలో 21.67 మీటర్లు, మధురవాడలో 23.38 మీటర్లు, సెంట్రల్‌పార్కు వద్ద 17.33, శివాజీపాలెంలో 14 మీటర్లు, గాజువాక కణితికాలనీలో 13.14 మీటర్ల లోతుకు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పద్మనాభం మండలం అనంతవరంలో 11.82 మీటర్లు, పాండ్రంకిలో 10.17 మీటర్లు, ఆనందపురం మండలం శొంఠ్యాంలో 11.1 మీటర్లు, పందులపాకలో 10.88 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నగరంలో అపార్టుమెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నచోట భూగర్భ జలాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో నగరంలో పలు ప్రాంతాలు డార్క్‌ జోన్‌లోకి వెళ్లడం ఖాయమంటున్నారు. నగరంలో భూగర్భ జలాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని జిల్లా భూగర్భ జల శాఖాధికారి పుష్పలత పేర్కొన్నారు. ఎండాడలో పరిస్థితి ఆందోళనంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. నీటి వినియోగంలో ప్రజలు పొదుపు పాటించాలని, రీచార్జి వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని లేకపోతే ఎండాడ, మధురవాడ, ఆరిలోవ, రుషికొండ, నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలోకి పడిపోతాయన్నారు.

--------------------------------------------------------------------------

ప్రాంతం 2025 మే 25 2026 మే 26

నీటిలోతు

---------------------------------------------------------------------------

ఎండాడ 17.17 మీటర్లు 28.9 మీటర్లు

పెదరుషికొండ 18.66 మీటర్లు 21.67 మీటర్లు

మధురవాడ 19.61 మీటర్లు 23.38 మీటర్లు

ఆరిలోవ 20.75 మీటర్లు 24.5 మీటర్లు

శివాజీపాలెం 11.98 మీటర్లు 14 మీటర్లు

సెంట్రల్‌ పార్కు 11.05 మీటర్లు 17.33 మీటర్లు

పెందుర్తి 11.66 మీటర్లు 12.78 మీటర్లు

శొంఠ్యాం 9.9 మీటర్లు 11.1 మీటర్లు

పాలవలస 0.34 మీటర్లు 1.07 మీటర్లు

చిప్పాడ 1.4 మీటర్లు 1.65 మీటర్లు

విశాలాక్షి నగర్‌ 8.26 మీటర్లు 11.19 మీటర్లు

Updated Date - May 29 , 2026 | 12:41 AM