Share News

నేడు ఉత్తరవాహినికి జలహారతి

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:50 PM

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద జల హారతి, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు ఉత్తరవాహినికి జలహారతి
ఉత్తరవాహిని ఘాట్‌ వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు

శివరాత్రికి బలిఘట్టం ఉత్తరవాహిని ముస్తాబు

భక్తుల కోసం జల్లు స్నానాలు

నర్సీపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద జల హారతి, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం వేద పండితులతో జలహారతి నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రంతా జాగారం ఉండి సోమవారం తెల్లవారుజామున ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే భక్తుల కోసం మునిసిపల్‌ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వరహానదిలో స్నానాలు చేయలేని వారి కోసం ఘాట్‌ల వద్ద ప్రత్యేకంగా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. బలిఘట్టం నుంచి ఉత్తరవాహినికి వచ్చే దారి పొడవునా లైట్లు ఏర్పాటు చేశారు. స్నానాల ఘాట్‌లకు విద్యుత్‌ దీపాల తోరణాలతో అలంకరించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గఫూర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐల పర్యవేక్షణలో బలిఘట్టం నుంచి ఉత్తరవాహిని వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా 50 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరవాహని వద్ద పుణ్యస్నానాలు చేసిన భక్తులు బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. పాలకపాటి గురుదేవుల ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం అన్నపూర్ణ అక్షయ పాత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:50 PM