వృథాగా అతిథిగృహం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:47 AM
పాయకరావుపేట పట్టణంలో కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ అతిథిగృహం వృథాగా పడివుంది. ప్రధానంగా ఫర్నిచర్ సమకూర్చకపోవడంతో నిరుపయోగంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఒక సూట్ రూమ్‌ను పాత సామాన్లతో స్టోర్ రూమ్‌గా మార్చేశారు. నిర్వహణ కొరవడడంతో గదులు, ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అతిథిగృహం పోర్టికోతోపాటు ఆవరణను స్థానికులు వాహనాల పార్కింగ్‌కు వినియోగించుకుంటున్నారు.
నిర్వహణను గాలికొదిలేసిన పంచాయతీరాజ్ అధికారులు
పదేళ్ల కిత్రం రూ.1.5 కోట్లతో నిర్మాణం
సూట్ రూములకు సమకూర్చని ఫర్నిచర్
సిబ్బంది లేకపోవడంతో అపరిశుభ్రంగా మారిన ఆవరణ
ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాల పార్కింగ్
పట్టించుకోని పీఆర్ ఉన్నతాధికారులు
పాయకరావుపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట పట్టణంలో కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ అతిథిగృహం వృథాగా పడివుంది. ప్రధానంగా ఫర్నిచర్ సమకూర్చకపోవడంతో నిరుపయోగంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఒక సూట్ రూమ్‌ను పాత సామాన్లతో స్టోర్ రూమ్‌గా మార్చేశారు. నిర్వహణ కొరవడడంతో గదులు, ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అతిథిగృహం పోర్టికోతోపాటు ఆవరణను స్థానికులు వాహనాల పార్కింగ్‌కు వినియోగించుకుంటున్నారు.
సుమారు ఆరు దశాబ్దాల క్రితం పాయకరావుపేటలో జిల్లా పరిషత్ అతిథిగృహాన్ని నిర్మించారు. చాలా ఏళ్ల వరకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలు, విడిదితో సందడిగా వుండేది. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల క్రితం భవనంపై మరో అంతస్థుల నిర్మించారు. కానీ పునాదులు బలంగా లేకపోవడంతో కొద్దికాలానికే భవనం గోడలు, శ్లాబు దెబ్బతిని, పెచ్చులూడి పడుతుండడంతో అతిథిగృహాన్ని వినియోగించడం ఆపేశారు. మరమ్మతులు కూడా చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1.5 కోట్లతో అతిథిగృహానికి రెండు అంతస్థులతో ఆధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించారు. ఇందులో నాలుగు సూట్‌లు, ఒక సమావేశ మందిరం, డైనింగ్ హాలు వున్నాయి. కానీ సూట్ రూమ్‌లలో బెడ్స్, టేబుళ్లు, కుర్చీలు, టీపాయిలు వంటి ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించలేదు. తరువాత వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈ భవనాన్ని అప్పుడప్పుడు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. వైసీపీ నాయకులు ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుని అతిథిగృహాన్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీ నాయకులు ఈ అతిథిగృహంలో అంతకుముందు తాము ఏర్పాటుచేసుకున్న ఫర్నిచర్‌ను పట్టుకుపోయారు. దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్ ఉద్యోగులు కింది అంతస్థులోని ఒక సూట్ రూమ్‌ను స్టోర్ రూమ్‌గా మార్చేశారు. పనికిరాని వస్తువులను ఇందులో పడేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి అయిన వంగలపూడి అనిత అధికారుల సమావేశాలను నక్కపల్లి సమీపంలోని తన క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తుండడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాయకరావుపేటలోని అతిథిగృహం బాగోగులను పట్టించుకోవడం మానేశారు. గెస్ట్ హౌస్ నిర్వహణకు అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించలేదు. కనీసం వాచ్‌మన్ కూడా లేరు. అప్పుడప్పుడు పంచాయతీ సిబ్బంది వచ్చి ఆవరణను శుభ్రం చేస్తుంటారు. సూట్ రూమ్‌లు, బాత్‌రూమ్‌ను శుభ్రం చేయకపోవడంతో దుమ్ము, ధూళి పేరుకుపోయాయి. వాచ్‌మన్ సైతం లేకపోవడంతో పలువురు నాయకులు, ప్రైవేటు వ్యక్తులు తమ వాహనాలను పోర్టికోలో, ఆవరణలో పార్కింగ్ చేస్తున్నారు.