చెత్త ప్రొసెసింగ్ యూనిట్ ప్రారంభం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:32 AM
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం
తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి
అప్పుడే పథకానికి ప్రయోజనం
కలెక్టర్ విజయకృష్ణన్
నర్సీపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది చెత్త ప్రొసెంగ్ కేంద్రాలను సీఎం చంద్రబాబునాయుడు గుడివాడలో ప్రారంభించగా, నర్సీపట్నంలో మాజీ కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేశ్‌లతో కలిసి కలెక్టర్ విజయకృష్ణన్ ఈ యూనిట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణకు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. డ్రైనేజీల్లో చెత్త వేయడం వల్ల దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడతారని తెలిపారు. వీధులను శుభ్రంగా ఉంచుకోకపోతే ఇటువంటి పథకాలు ఎన్ని వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. మొక్కల పెంపకాన్ని అందరూ బాధ్యతగా చేపట్టాలన్నారు. డంపింగ్ యార్డు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని రాజేశ్ కోరారని, ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. థర్డ్ గ్రేడ్ నుంచి ఫస్ట్ గ్రేడ్ మునిసిపాలిటీగా హోదా పెరడగం పెద్ద విజయమని అభినందనలు తెలిపారు. రూ.3 కోట్లతో చెత్త ప్రొసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మునిసిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి వీఎంఆర్డీవో ద్వారా రూ.4 కోట్లు, సీఎస్‌ఆర్ నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మాజీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మునిసిపాలిటీలోని 28 వార్డులు డంపింగ్ యార్డులుగా ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెత్త సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీవీ రమణ, కమిషనర్ జంపా సురేంద్ర, ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకట రమణ, జనసేన ఇన్‌చార్జ్ సూర్యచంద్ర, ఐవే సంస్థ ప్రతినిధి వినోద్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.