సంపద కేంద్రం వద్ద వ్యర్థాలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:28 AM
మండలంలోని తానాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమీపంలో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య కార్మికులు గ్రామంలో సేకరించిన చెత్తనంతటిని సంపద కేంద్రం వద్దకు తీసుకువచ్చి పడేస్తున్నారు.
తానాంలో పేరుకుపోయిన చెత్తాచెదారం
జడ్పీ సీఈవో ఆదేశాలు బేఖాతరు
పరవాడ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తానాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమీపంలో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య కార్మికులు గ్రామంలో సేకరించిన చెత్తనంతటిని సంపద కేంద్రం వద్దకు తీసుకువచ్చి పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లడంతోపాటు ఈగలు, దోమలు వృద్ధి చెంది సమీపంలో నివాసం ఉంటున్న వారిని అనారోగ్యంపాలు చేస్తున్నాయి. ఇక్కడ గత కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను పరవాడ వద్ద గల డంపింగ్‌యార్డుకు తరలించాలని అధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ తానాం పంచాయతీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 21వ తేదీన జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి తానం గ్రామంలో పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం చుట్టూ ఉన్న చెత్త కుప్పలను చూసిన ఆయన, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద కేంద్రం చుట్టూ ఉన్న చెత్తను 15 రోజుల్లోగా పరవాడలోని డంపింగ్‌యార్డుకు తరలించాలని, చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలని సూచించారు. ఇది జరిగి సుమారు 23 రోజులైంది. కానీ ఇంతవరకు చెత్తకుప్పలను తొలగించలేదు. పైగా గతంలో మాదిరిగానే ఇక్కడ చెత్త వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జడ్పీ సీఈవో ఆదేశాలను బేఖాతరు చేయడంపై ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక చెత్తను తరలించకుండా నిప్పుపెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మండల, జిల్లా అధికారులు స్పందించి తానాంలో సంపద తయారీ కేంద్రం వద్ద చెత్తను తొలగించి పరవాడ వద్ద వున్న డంపింగ్‌యార్డుకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.