Share News

వివాదాస్పద భూమిలో హెచ్చరిక బోర్డు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:58 PM

అనకాపల్లి పట్టణంలోని రింగురోడ్డులో ఇటీవల వివాదానికి దారితీసిన భూముల్లో కన్యకాపరమేశ్వరి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

వివాదాస్పద భూమిలో హెచ్చరిక బోర్డు
వివాదాస్పద భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న కన్యకాపరమేశ్వరి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు

కొత్తూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణంలోని రింగురోడ్డులో ఇటీవల వివాదానికి దారితీసిన భూముల్లో కన్యకాపరమేశ్వరి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వీరిని అడ్డుకుని, ఈ స్థలం కాండ్రేగుల సూరిఅప్పారావు భార్య చినతల్లి కుటుంబ సభ్యులకు చెందుతుందని అన్నారు. అయితే ఈ భూమి దేవదాయ శాఖకు చెందుతుందని కోర్టు స్పష్టం చేసినట్టు దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. అయినప్పటికీ సదరు ప్రైవేటు వ్యక్తులు అంగీకరించలేదు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వచ్చి, ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. అనంతరం దేవదాయ శాఖ జిల్లా అధికారి సుధారాణి, విశాఖపట్నం నుంచి వచ్చిన కన్యకాపరమేశ్వరి దేవస్థానం సభ్యులు తమ వద్ద ఉన్న ఆధారాలను పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌కు అందించారు. అయితే ఈ భూమిపై గతంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నామని, తమ వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని ప్రైవేటు వ్యక్తులు చెప్పారు. ఇరువర్గాల వారు ఇచ్చిన పత్రాలను పరిశీలించిన సీఐ.. ఒక ఎకరా 11 సెంట్ల భూమి వివాదాస్పదంగా ఉన్నందున దీనిపై రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తామని, అంతవరకు ఎవరూ ఆ భూమిలోకి వెళ్లవద్దని స్పష్టం చేశారు.

Updated Date - Mar 09 , 2026 | 11:58 PM