మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - May 14 , 2026 | 12:49 AM
జిల్లా కేంద్రం పాడేరుకు బుధవారం వచ్చిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం లభించింది.
హెలీప్యాడ్ నుంచి వివాహ వేదికకు చేరే వరకు ప్రజల్ని ఆప్యాయంగా పలకరించిన మంత్రి
పలువురు అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో సెల్ఫీలు
పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరుకు బుధవారం వచ్చిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకున్న ఆయనకు కలెక్టర్ టి.నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, శ్రావణ్‌కుమార్ సోదరుడు సందీప్‌కుమార్, తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. హెలీప్యాడ్‌కు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి ఆయనతో ఫొటోలు దిగారు. హెలీప్యాడ్ బారికేడ్ల వద్ద లోకేశ్‌తో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. హెలీప్యాడ్ నుంచి లగిశపల్లి, కాడెలి, కిండంగి గ్రామాల మీదుగా పాడేరులోని తుమ్మరమెట్ట మైదానంలో జరిగిన గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ వివాహానికి వచ్చిన లోకేశ్‌కు దారి పొడవునా జనం స్వాగతం పలికారు. ఆయన కూడా జనంతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేదిక వద్ద తనను పలకరించిన వారితో కరచాలనం చేశారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, బండారు సత్యనారాయణ మూర్తి, కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, ఏఎస్‌పీ నవజ్యోతి మిశ్రా, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.