Share News

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:18 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు.

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

విమానాశ్రయం, పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరణ

నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ కంపెనీకి భూమి పూజ

విశాఖపట్నం/గోపాలపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజవాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పి.గణబాబు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభి, బత్తుల తాతయ్యబాబు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, నాయకులు గండి బాబ్జీ, కిడారి శ్రావణ్‌కుమార్‌, గిడ్డి ఈశ్వరి, దువ్వారపు రామారావు, పీవీజీ కుమార్‌, బుద్దా నాగజగదీష్‌, దాడి రత్నాకర్‌, తదితర నాయకులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనతో పలువురు ప్రయాణికులు ఫొటోలు దిగారు. కొందరు అర్జీలు అందజేయగా పరిశీలించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వినతులు స్వీకరించారు. రాత్రికి పార్టీ కార్యాలయం ఆవరణలో బస్సులో బస చేశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అనకాపల్లి జిల్లా రాంబిల్లి వెళతారు.

అచ్యుతాపురం సెజ్‌లో బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ఫార్మా...

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో రూ.2,300 కోట్లతో ఏర్పాటుకానున్న బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఫార్మా కంపెనీకి శనివారం ఉదయం మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేస్తారు. ఇక్కడ 102.48 ఎకరాల్లో మూడు దశల్లో ఫార్మా కంపెనీని నిర్మించనున్నారు. మొదటి దశ 2027కు, రెండో దశ ఏప్రిల్‌ 2030కి, మూడో దశ అక్టోబరు 2031కి పూర్తవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్‌ కంపెనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 3.15 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.

Updated Date - Feb 28 , 2026 | 01:18 AM