Share News

వార్డుల విభజన ముసాయిదా విడుదల

ABN , Publish Date - May 19 , 2026 | 12:06 AM

నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఆయా కమిషనర్లు సోమవారం వార్డుల విభజన ముసాయిదాను విడుదల చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘం వార్డుల విభజన ముసాయిదా ప్రతులను కమిషనర్‌ జంపా సురేంద్ర విడుదల చేశారు.

వార్డుల విభజన ముసాయిదా విడుదల
నర్సీపట్నంలో వార్డుల విభజన ముసాయిదా ప్రతులు ప్రదర్శిస్తున్న కమిషనర్‌ సురేంద్ర, సిబ్బంది

నర్సీపట్నంలో 28 నుంచి 40..

ఎలమంచిలిలో 25 నుంచి 32 వార్డులకు పెంపు

25వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ

నర్సీపట్నం/ఎలమంచిలి, మే 18 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఆయా కమిషనర్లు సోమవారం వార్డుల విభజన ముసాయిదాను విడుదల చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘం వార్డుల విభజన ముసాయిదా ప్రతులను కమిషనర్‌ జంపా సురేంద్ర విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 40 వార్డులకు పెంచుతూ సరిహద్దులతో సహా ప్రకటించారు. సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి ముసాయిదా ప్రతులు ప్రదర్శించారు. ముసాయిదా ప్రతులను సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రదర్శించారు. దీనిపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరణకు ఏడు రోజులు గడువు ప్రకటించారు.

వార్డుల విభజన ఇది రెండోసారి...

మునిసిపాలిటీ వార్డుల పునర్విభజన జరగడం ఇది రెండో పర్యాయం. 2011లో నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం పంచాయతీలను కలిపి 27 వార్డులతో నర్సీపట్నం మునిసిపాలిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో 2019-20లో 27 వార్డులను 28 వార్డులకు పెంచారు. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం 60 వేల నుంచి 80 వేలలోపు జనాభా కలిగిన మునిసిపాలిటీలలో 40 వార్డులకు పెంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గత నెలలో మునిసిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సచివాయ సిబ్బందితో కలిసి 28 వార్డులలో సర్వే చేపట్టారు. 40 వార్డుల విభజన సరిహద్దులతో పాటు మ్యాప్‌తో సహా సిద్ధం చేశారు. వార్డుల విభజన మీద సందేహాలు ఉంటే టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో నివృత్తి చేసుకోవాలని కమిషనర్‌ సురేంద్ర కోరారు.

ఎలమంచిలిలో..

మునిసిపాలిటీలో జనాభా, ఓటర్ల ప్రాతిపదికన వార్డుల పునర్విభజన ముసాయిదాను సోమవారం మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు విడుదల చేశారు. ఎలమంచిలి మునిసిపల్‌ కార్యాలయ నోటీసు బోర్డులో ముసాయిదా ప్రతులను ఏర్పాటు చేశారు. అలాగే తహశీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల నోటీసు బోర్డుల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు.

25 నుంచి 32 వార్డులకు పెంపు

మునిసిపాలిటీలో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను 25 నుంచి 32 వార్డులకు పెంచుతూ ముసాయిదా విడుదల చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. మునిసిపల్‌ కమిషనర్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది సర్వే చేసిన అనంతరం ముసాయిదా ప్రతిపాదన సిద్ధం చేశారు. వార్డుల పునర్విభజన విషయంలో ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఎలమంచిలి మునిసిపల్‌ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా అందజేయవచ్చు.

Updated Date - May 19 , 2026 | 12:06 AM