వార్డుల విభజన ప్రారంభం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:28 AM
మునిసిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జనాభా, భౌగోళిక విస్తీర్ణం పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ప్రకారం నర్సీపట్నం మునిసిపాలిటీ జనాభా 61,540. వార్డుల పునర్విభజకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 64లో మునిసిపాలిటీ జనాభా 60 వేల నుంచి 80 వేల మధ్యలో ఉంటే 40 వార్డులు వుండాలి. దీంతో నర్సీపట్నం జనాభా 60 వేలు దాటి వున్నందున వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరుగుతుంది.
నర్సీపట్నంలో సర్వే చేస్తున్న అధికారులు
9వ తేదీతో ప్రక్రియ పూర్తి.. ముసాయిదా తయారీ
10 నుంచి 16వ తేదీ వరకు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాల స్వీకరణ
పరిశీలన అనంతరం కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు నివేదిక
మే మొదటి వారంలో తుది నోటిఫికేషన్ విడుదల
నర్సీపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జనాభా, భౌగోళిక విస్తీర్ణం పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ప్రకారం నర్సీపట్నం మునిసిపాలిటీ జనాభా 61,540. వార్డుల పునర్విభజకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 64లో మునిసిపాలిటీ జనాభా 60 వేల నుంచి 80 వేల మధ్యలో ఉంటే 40 వార్డులు వుండాలి. దీంతో నర్సీపట్నం జనాభా 60 వేలు దాటి వున్నందున వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరుగుతుంది. ఈ మేరకు వార్డుల పునర్విభజనపై సర్వే చేసి ముసాయిదాని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం కమిషనర్ సురేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి సత్యనారాయణ కలిసి సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. వార్డుల పునర్విభజనను పూర్తి చేసిన తరువాత ముసాయిదా తయారు చేసి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు
మునిసిపల్ అధికారులు ఈ నెల 9వ తేదీలోగా వార్డుల ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేయాలి. అదే రోజున ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలి. 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలిస్తారు. అనంతరం వార్డుల విభజన ప్రతిపాదనను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ పరిశీలించి మునిసిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)కి నివేదిస్తారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, కలెక్టర్ నివేదికను పరిగణనలోకి తీసుకొని సీడీఎంఏ నివేదికను ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వం ఆమోదముద్ర వేసి మే మొదటి వారంలో తుది నోటిఫికేషన్ జారీ అవుతుంది.
ఆశా వాహుల్లో ఆనందం
మునిసిపాలిటీలో వార్డుల సంఖ్య ఒకేసారి 28 నుంచి 40కి పెరగనుండడంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు ఆశావాహుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. గత ఎన్నికల్లో వివిధ రకాల రిజర్వేషన్ల వల్ల కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి అవకాశం లభించని వారు.. ఈసారి పోటీకి ఛాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.