Share News

రేషన్‌ డీలర్ల మధ్య వార్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:33 AM

‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌’ పేరుతో పౌరసరఫరాల శాఖ అందించే బియ్యం, ఇతర సరుకులు దేశంలో ఏ చౌకడిపో నుంచి అయినా తీసుకునే వెసులబాటును కొంతమంది రేషన్‌ డీలర్లు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్‌ డీలర్ల మధ్య వార్‌

చిచ్చు పెడుతున్న అదనపు కోటా

పోర్టబిలిటీ పేరుతో పక్క డిపోల కార్డులకు సైతం బియ్యం పంపిణీ

మరుసటి నెల మరింత కోటా విడుదల

కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు.. నల్లబజారుకు తరలింపు

హేతుబద్ధతలేని అదనపు కోటాతో పలు డిపోల్లో మిగిలిన స్టాకు

జిల్లా అఽధికారులను కాదని పౌరసరఫరాల కమిషనరేట్‌ నిర్ణయం

విశాఖపట్నం/ఆరిలోవ/గాజువాక, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):

‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌’ పేరుతో పౌరసరఫరాల శాఖ అందించే బియ్యం, ఇతర సరుకులు దేశంలో ఏ చౌకడిపో నుంచి అయినా తీసుకునే వెసులబాటును కొంతమంది రేషన్‌ డీలర్లు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక డిపోనకు మ్యాపింగ్‌ చేసిన కార్డుదారుల ఇళ్లకు మరో రేషన్‌ డిపో డీలర్‌ వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్ర వేసి బియ్యం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సరుకులు పంపిణీచేసే డిపోకు అదే నెలలో అదనపు కోటా పేరిట ఎక్కువ బియ్యం కేటాయిస్తున్నారు. దీంతో ఒక డీలరు పది నుంచి 20 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, కేవలం తన పరిధిలో కార్డులకే పరిమితమైన డీలర్లు తమకు కేటాయించిన బియ్యాన్ని పూర్తిగా పంపిణీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో డీలర్ల మధ్య వివాదం చెలరేగుతున్నది. గత మూడు నెలల నుంచి ఈ సమస్య తీవ్రం కావడంతో నగరంలో పలుచోట్ల డీలర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపుకోటా అమలులో సరైన విధానం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం నగరంలో పలువురు డీలర్ల వద్ద బియ్యం నిల్వలు మిగిలిపోయారుు.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ పేరిట పోర్టబిలిటీ విధానం ప్రోత్సహించడానికి ప్రతి డిపోకు మ్యాపింగ్‌ అయిన కార్డులకు 60 శాతం కార్డుదారులకు సరుకులు అందజేయాలి. మిగిలిన 40 శాతం పోర్టబిలిటీ ద్వారా ఏ ప్రాంతానికి చెందిన కార్డుదారుడుకైనా సరుకులు ఇచ్చుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నగరంలోని కార్డుదారుల్లో ఎక్కువ మంది రేషన్‌ బియాన్ని డీలర్లకు లేదా వీధుల్లోకి వచ్చే దళారులకు విక్రయిస్తున్న నేపథ్యంలో పలువురు డీలర్లు సొమ్ములకు ఆశపడి పోర్టబిలిటీని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చే 40 శాతం పోర్టబిలిటీ దాటి బియ్యం అందజేస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో 40 శాతం పోర్టబిలిటీని పలువురు దాటేశారు. కోటవీధి, పూర్ణామార్కెట్‌, కురుపాం మార్కెట్‌, అక్కయ్యపాలెం, సీతంపేట, కంచరపాలెం, గాజువాక, ఆరిలోవ, మర్రిపాలెం ప్రాంతాల్లో కొందరు డీలర్లు సమీపంలోని ఇతర డిపోలకు మ్యాపింగ్‌ అయిన కార్డుదారులకు ఇళ్లకు వెళ్లి వేలిముద్రలు వేసి బియ్యానికి బదులు సొమ్ములు ఇస్తున్నారు.

సాధారణంగా ప్రతి నెల ఒక డిపోలో సరుకులు మొత్తం గడువులోగా పంపిణీచేస్తే జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపుకోటా ఇచ్చేది. దీని వల్ల ఒక డిపోలో మిగిలిన సరుకులను పక్క డిపోకు అలాట్‌మెంట్‌ చేసేవారు. అయితే గత మూడు నెలల నుంచి అదనపుకోటాను విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ మంజూరు చేస్తున్నది. అదనపు కోటా కోసం పలువురు డీలర్లు పోర్టబిలిటీని నెలనెల పెంచుకుంటూ పోతున్నారు. అక్కయ్యపాలెం పరిధిలో ఒక డిపోకు 14.5 టన్నుల బియ్యం మాత్రమే అలాట్‌మెంట్‌ జరిగేది. పోర్టబిలిటీ కార్డులకు ఎక్కువగా సరుకులు ఇవ్వడంతో ప్రస్తుతం డిపో కెపాసిటీ 19.5 టన్నులకు చేరింది. ఈ డిపోకు మరో డిపోను అటాచ్‌చేయడంతో దాని పేరుతో ఇరుగుపోరుగు డిపోల కార్డులకు ఎడాపెడా సరుకులు ఇచ్చేశారు. నల్లబజారులో రేషన్‌ బియ్యం విక్రయాల కోసమే పలువురు డీలర్లు బరితెగిస్తున్నారని మరికొందరు డీలర్లు ఆరోపిస్తున్నారు. పోర్టబిలిటీతో కొందరు ప్రయోజనం పొందగా మరికొందరు వద్ద సరుకులు మిగిలిపోతున్నాయి. ఈ నెల 15వ తేదీతో సరుకుల పంపిణీ పూర్తయిన నేపథ్యంలో సర్కిల్‌-2లోని 46వ డిపోలో 8.7 టన్నులు, 360వ నంబరు డిపోలో 7.44 టన్నులు, 220వ నంబరు డిపోలో 5.3 టన్నులు, సర్కిల్‌-1 పరిధిలో డిపో నంబరు 90లో 7.08 టన్నులు, 129 నంబరు డిపోలో 5.3 టన్నులు, సర్కిల్‌-3లో డిపో నంబరు 286లో 5.7 టన్నుల బియ్యం మిగిలిపోయాయి. ఇంకా అనేక డిపోల్లో సరుకులు మిగిలిపోయాయి. అదనపుకోటాపై జిల్లా స్థాయిలో సమీక్షించే అధికారం జిల్లా అధికారులకు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోర్టబిలిటీని 40 శాతానికే పరిమితం చేయాలని డీలర్లు కోరుతున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:33 AM