Share News

దారి కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Jun 21 , 2026 | 10:56 PM

మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో వీరికి డోలీమోతలు తప్పడం లేదు.

దారి కోసం ఎదురుచూపులు
పందిరిమామిడి డిపో నుంచి రేషన్‌ సరుకులతో కాలినడకన వెళుతున్న నక్కులమామిడి గిరిజనులు (ఫైల్‌ ఫొటో)

నక్కులమామిడి గ్రామానికి రహదారి లేక అవస్థలు

రేషన్‌ తెచ్చుకోవాలంటే కాలినడకన వెళ్లాల్సిందే

ఆస్పత్రికైతే డోలీమోతలే శరణ్యం

కోడితల గ్రామం నుంచి రోడ్డు నిర్మించాలని గిరిజనుల వేడుకోలు

కలెక్టర్‌ స్పందించడంతో సమస్య పరిష్కారం అవుతుందని ఆశ

అనంతగిరి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో వీరికి డోలీమోతలు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రహదారుల నిర్మాణం పూర్తి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా కలెక్టర్‌ స్పందించి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించడంతో ఈ ఏడాదైనా తమ కల నెరవేరుతుందేమోనని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కివర్ల పంచాయతీ నక్కులమామిడి గ్రామానికి టెంకలవలస నుంచి పందిరిమామిడి మీదుగా నక్కులమామిడి గ్రామం వరకు 5 కిలో మీటర్లకు గాను రూ.3.23 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెంకలవలస నుంచి పందిరిమామిడి వరకు 2.5 కిలోమీటర్ల వరకు రూ.2.6 కోట్లతో తారురోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే పందిరిమామిడి నుంచి నక్కులమామిడి వరకు ఎత్తైన కొండలు, ఘాటీ ఉండడంతో అంచనా వ్యయం పెరిగింది. నిధులు చాలకపోవడం కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. దీంతో అధికారులు మూడేళ్ల క్రితం రూ.6 కోట్లతో ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరుకాకపోవడంతో రహదారి నిర్మాణానికి కదలిక రాలేదు. దీని వల్ల నక్కులమామిడి గ్రామస్థులకు డోలీమోతలు తప్పడం లేదు. రేషన్‌ సరుకులు తెచ్చుకోవడానికి పందిరిమామిడి డిపోనకు కాలినడకనే వెళ్లాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితమైన ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం

హుకుంపేట మండలం కోడితల గ్రామం నుంచి నక్కులమామిడి గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే గిరిజనుల కష్టాలు తీరతాయి. ఈ మేరకు రూ.6 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నక్కులమామిడి గ్రామంలో సుమారు 350 మంది జనాభా ఉన్నారు. వీరంతా చందాలు వేసుకుని సుమారు రూ.5 లక్షలు సేకరించి కోడితల గ్రామం వైపు నుంచి కిలోమీటరు మేర తాత్కాలికంగా మట్టిరోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత డబ్బులు లేక పనులను మధ్యలోనే నిలిపివేశారు. కాగా గ్రామంలోని 33 గిరిజన కుటుంబాలకు పీఎం జన్‌మన్‌ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. అయితే రహదారి సౌకర్యం లేక కోడితల గ్రామం నుంచి ఇసుక, సిమెంట్‌, ఇనుమును మట్టిరోడ్డు ఉన్నంత వరకు తెచ్చుకుని అక్కడ భద్రపరుచుకున్నారు. అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు మోసుకుంటూ గ్రామానికి తెచ్చుకుంటున్నారు.

రహదారి కోసం నిరసన

గత నెల 27న అనంతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి కలెక్టర్‌ టి.నిషాంతి హాజరుకాగా, రహదారి కావాలంటూ నక్కులమామిడి గ్రామస్థులు అడ్డాకుల టోఫీలు, డోలీమోతతో నిరసన తెలియజేశారు. కలెక్టర్‌ స్పందించి రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదైనా రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 10:56 PM