గౌరవ వేతనానికి ఎదురుచూపులు
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:06 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో నిర్వహించే పలు కోర్సులకు టీచింగ్ అరేంజ్‌మెంట్స్‌లో భాగంగా ఏయూలోని వివిధ విభాగా లకు చెందిన ఫ్యాకల్టీ తోపాటు వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి కొందరు అధ్యాపకులను పాఠాలు బోధించేందుకు తీసుకుంటారు.
ఏయూలో దూర విద్య బోధకులకు రెండేళ్లుగా నిలిచిన చెల్లింపులు
గెస్ట్ క్లాసులు బోధించిన 200 మందికి నిలిపివేత
మూల్యాంకనం చేసిన వారికీ మొండిచేయి
విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో నిర్వహించే పలు కోర్సులకు టీచింగ్ అరేంజ్‌మెంట్స్‌లో భాగంగా ఏయూలోని వివిధ విభాగా లకు చెందిన ఫ్యాకల్టీ తోపాటు వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి కొందరు అధ్యాపకులను పాఠాలు బోధించేందుకు తీసుకుంటారు. వీరికి గంటన్నరకు కొంతచొప్పున చెల్లిస్తుంటారు. ఈ గౌరవ వేతనాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తుండాలి. అయితే, 2024-25, 2025-26 విద్యా సంవత్సరానికి సంబం ధించి బోధకులకు పూర్తిస్థాయి గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో వారంతా అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.
దూర విద్య పరిధిలో సుమారు 30 కోర్సులు నిర్వహిస్తు న్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు చొప్పున ఫ్యాకల్టీని తీసు కుంటారు. వీరంతా 15 రోజులపాటు నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో పాఠాలు బోధిస్తుంటారు. ఫ్యాకల్టీకి కేటాయించే సమయాన్ని బట్టి వారికి గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇలా ఒక్కో ఫ్యాకల్టీకి సుమారు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాలి. పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు వాపో తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్య ను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
వాల్యుయేషన్ చెల్లింపులూ పెండింగ్..
దూర విద్య పరీక్షల అనంతరం పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ కోసం అనుబంధ కాలేజీలు, ఏయూలోని పలు విభాగాలకు చెందిన ఫ్యాకల్టీని తీసుకుంటారు. ఒక్కో పేపర్ మూల్యాంకనానికి సుమారు రూ.18 నుంచి రూ.25 వరకు చెల్లిస్తుంటారు. ఇలా ప్రతిరోజూ ఒక్కో ఫ్యాకల్టీ 40 నుంచి 80 వరకు పేపర్లు మూల్యాంకనం చేయవచ్చు. ప్రక్రియ ముగిసిన తరువాత రెమ్యూనరేషన్ చెల్లించాలి. అయితే గత రెండు, మూడు పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన వారికి ఇప్పటికీ చెల్లించలేదు. అంతేకాదు ఈ ప్రక్రియను మొక్కుబడిగా నిర్వహిస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేయాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా నెలలు తరబడి సాగదీస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో జరి గిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటివరకు సాగుతోందని, ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలి యడం లేదని చెబుతున్నారు. దీనిపై దూర విద్య కేంద్రం డైరెక్టర్ అప్పలనాయుడును వివరణ కోరగా ఫ్యాకల్టీకి గౌర వ వేతనం పెండింగ్ లేకుండా చూస్తామన్నారు. పేపర్ మూల్యాంకనానికి సంబంధించిన బకాయిలను ఇప్పటికే చెల్లించేశామని, ఎవరికైనా అందకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు.