సబ్సిడీ రుణాలకు ఎదురుచూపులు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:22 AM
నిరుపేదలకు బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు ప్రక్రియ ముందుకుసాగడం లేదు.
ఏడాది క్రితం దరఖాస్తులు స్వీకరించిన బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లు
బీసీ కార్పొరేషన్ పరిధిలోని యూనిట్ల కోసం 18,894 రాక
ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన యూనిట్లకు 8,945...
అక్కడ నుంచి ముందుకుసాగని ప్రక్రియ
యూనిట్లు పెంచే ప్రతిపాదన ఉందంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నిరుపేదలకు బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు ప్రక్రియ ముందుకుసాగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన సం క్షేమ శాఖలను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా గడిచిన ఏడాది సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుమారు ఆరేళ్ల తరువాత రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో వేలాది దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారిని ఎంపిక చేసి రుణాలు/యూనిట్లు మంజూరుచేస్తారని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా గడిచిన ఏడాది జూన్ నుంచి ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది.
అదనపు యూనిట్లు మంజూరు చేయాలని..
సుమారు ఆరేళ్ల తరువాత బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల నుంచి సబ్సిడీతో కూడిన రుణాలు/ యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. తమ పేరు సిఫారసు చేయాలని దరఖాస్తుదారులంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం ప్రారంభించారు. జిల్లాలకు కేటాయించిన యూనిట్లు తక్కువగా ఉండడం, దరఖాస్తులు భారీగా రావడంతో ప్రజా ప్రతినిధులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అనేకమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, యూనిట్లు పెంచాలని కోరారు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లను పెంచుతామని, అప్పటివరకూ రుణాల మంజూరు ప్రక్రియను పెండింగ్‌లో పెట్టాలని సూచింది. అయితే, ఏడాది కావస్తున్నా కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడాది కొందరికైనా యూనిట్లు మంజూరుచేసి ఉంటే, ఈ ఏడాది మరికొంత మందికి అవకాశం ఉండేదని, మొత్తం ప్రక్రియ ఆపేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు.
భారీగా దరఖాస్తులు
జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ, ఈబీసీ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లకు ప్రభుత్వం 2,436 యూనిట్లను కేటాయించగా 18,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా యూనిట్లకు 50 శాతం రుణం, మరో 50 శాతం సబ్సిడీగా అందించ నున్నారు. ఇందుకోసం రూ.58.13 కోట్లు బడ్జెట్‌ను కేటాయించింది. అలాగే, ఎస్సీ కార్పొరేషన్‌కు 406 యూనిట్లను మంజూరు చేయగా, 8,945 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 32 కేటగిరీల్లో యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం రూ.16.88 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.6.68 కోట్లు సబ్సిడీ కాగా, బ్యాంకు రుణం రూ.9.35 కోట్లు, లబ్ధిదారులు వాటా రూ.0.84 కోట్లు. రుణాలు మంజూరులో జాప్యంపై బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.శంకర రావును వివరణ కోరగా యూనిట్లు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియను నిలిపినట్టు తెలిపారు.మరిన్ని అదనపు యూనిట్లు మంజూరయ్యే అవకాశం ఉందని, కొద్ది రోజులు కిందట రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సమా వేశాన్ని కూడా నిర్వహించారన్నారు.