సేవలకు నిరీక్షణ
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:04 AM
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో రూ.22.2 కోట్లతో నిర్మించిన క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం (క్రిటికల్ కేర్ బ్లాక్) ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నది. దీని నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్
రూ.15 కోట్లతో భవనాలు, రూ.7.2 కోట్లతో ఆధునిక పరికరాలు
ఆరు నెలల క్రితమే నిర్మాణ పనులు పూర్తి
అందుబాటులోకి రాని నూతన విభాగం
అనకాపల్లి టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో రూ.22.2 కోట్లతో నిర్మించిన క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం (క్రిటికల్ కేర్ బ్లాక్) ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నది. దీని నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి అనుబంధంగా క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.22.2 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.15 కోట్లతో భవనాలు నిర్మించారు. మిగిలిన రూ.7.2 కోట్లను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఆధునిక వైద్య పరికరాల కోసం కేటాయించారు. 50 పడకలతో నిర్మించిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యవసర డెలివరీ విభాగం కింద రెండు గదులు కేటాయించారు. ఒక పీవోసీ ల్యాబ్, అల్ర్టా సౌండ్ సిస్టమ్, డ్రెస్సింగ్ గది, రిసెప్షన్, రిజిస్ర్టేషన్ విభాగాలు వుంటాయి. మొదటి అంతస్థులో ఐసోలేషన్ గదులు, కౌన్సెలింగ్ గది, డ్యూటీ డాక్టర్ల ఛాంబర్లతోపాటు 13 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. రోగులకు అందించే భోజనం కోసం ఒక గది కేటాయించారు. రెండో అంతస్థులో హెచ్‌డీయూ, ఐసీయూ విభాగాలను 18 పడకలతో ఏర్పాటు చేశారు. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడో అంతస్థులో వైద్యుల గదులు, రెండు అధునాతన ఆపరేషన్ థియేటర్లు వున్నాయి. 20 మంది ఒకేసారి పైఅంతస్థులకు వెళ్లేలా భారీ లిఫ్ట్‌ను సిద్ధం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా కలెక్టర్ ఆదేశాలతో ఎన్టీపీసీ మంజూరు చేసిన సీఎస్‌ఆర్ నిధులు రూ.15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ పనులన్నీ పూర్తయి దాదాపు ఆరు నెలలు కావస్తున్నది. అప్పట్లో సంక్రాంతి పండుగ సమయంలో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభిస్తారని అంతా భావించారు. కారణం ఏమిటో తెలియదుగానీ ప్రారంభానికి నోచుకోలేదు. వాస్తవానికి ఈ నెల తొమ్మిదో తేదీన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనకాపల్లిలోని క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వర్చువల్‌గా ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఇంజనీరింగ్, వైద్యాధికారులు చెబుతున్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.