బడి భోజనం బిల్లులకు నిరీక్షణ
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:09 AM
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పఽథకం నిర్వహణ బిల్లులు నాలుగు నెలల నుంచి మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరవగా, ఇంతవరకు ఒక్క నెల కూడా బిల్లులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు చివరినాటికి ఆరు కోట్ల రూపాయలకుపైగా బకాయిలు వున్నట్టు చెబుతున్నారు. నిధుల విడుదల గురించి పలుమార్లు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని భోజన పథకం కార్మికులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒక్క నెల కూడా విడుదల కాని నిధులు
కార్మికుల వేతన బకాయిలు రూ.కోటి
చోడవరం/ నర్సీపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పఽథకం నిర్వహణ బిల్లులు నాలుగు నెలల నుంచి మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరవగా, ఇంతవరకు ఒక్క నెల కూడా బిల్లులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు చివరినాటికి ఆరు కోట్ల రూపాయలకుపైగా బకాయిలు వున్నట్టు చెబుతున్నారు. నిధుల విడుదల గురించి పలుమార్లు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని భోజన పథకం కార్మికులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో 1,092 ప్రాథమిక పాఠశాలలు, 57 ప్రాథమికోన్నత పాఠశాలలు, 239 ఉన్నత పాఠశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో సుమారు 88 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులకు భోజనం వండి వడ్డించడానికి ప్రభుత్వం నిర్వహణ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.12, ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ.9.29 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు ఉచితం సరఫరా చేస్తుంది. ఇక వంట చేసే కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనంగా అందజేస్తున్నది. భోజన పథకం నిర్వాహకులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే వంటగ్యాస్, పప్పులు, వంటనూనె, కూరగాయలు, ఇతర దినుసులు కొనుగోలు చేసి మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి. విద్యార్థుల హాజరు ప్రకారం నిధుల విడుదల కోసం ప్రతి నెలా బిల్లులు అప్‌లోడ్ చేస్తుంటారు. సాధారణంగా ఒకటి లేదా రెండు నెలల్లో బిల్లులు మంజూరు అవుతుంటాయి. కానీ ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు దాటినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా బిల్లులు మంజూరు చేయలేదు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం చెల్లించే డైట్ చార్జీలు చాలక ఇబ్బంది పడుతున్నామని, మరోవైపు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుచేసి సరుకులు కొనుగోలు చేస్తున్నామని భోజన పథకం కార్మికులు వాపోతున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఆరు కోట్ల రూపాయల వరకు బకాయిలు వున్నట్టు చెబుతున్నారు.
రెండు నెలల గౌరవ వేతనం బకాయిలు
జిల్లాలో 1,670 మంది భోజనపధకం కార్మికులకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ఇచ్చే గౌరవ వేతనం రూ.3 వేలుకాగా, జూన్ నెలకు సంబంధించి సగం రోజులకు రూ.1,500 మాత్రమే అందాయి. జూలై, ఆగస్టు నెలలకు గౌరవ వేతనం అందలేదు. దీనికి సంబంధించి సుమారు కోటి రూపాయాలు అందాల్సివుంది.
అప్పులు చేసి సరుకులు కొనుగోలు
గూనూరు వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, మధ్యాహ్న భోజన పఽథకం నిర్వాహకుల సంఘం
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క నెలకు కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో విద్యార్థులకు భోజనం వండి వడ్డించడానికి అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తున్నది. బకాయిలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.