Share News

ఇళ్ల బకాయిలకు నిరీక్షణ

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:08 AM

పక్కా ఇళ్ల బిల్లుల బకాయిల కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లకు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి బిల్లులు మంజూరుచేయలేదు. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారుల లెక్కల ప్రకారం నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో సుమారు పది కోట్ల రూపాయల మేర లబ్ధిదారులకు అందాల్సి వుంది.

ఇళ్ల బకాయిలకు నిరీక్షణ
జోగింపేటలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించి, బిల్లు మంజూరు కావాల్సిన ఇల్లు

నర్సీపట్నం హౌసింగ్‌ డివిజన్‌లో రూ.9.95 కోట్లు పెండింగ్‌

2014-19 టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకం కింద ఇళ్లు మంజూరు

నిర్మాణ దశలో ఉండగా మారిన ప్రభుత్వం

ఐదేళ్లపాటు ఒక్కరికి కూడా బిల్లు ఇవ్వని వైసీపీ పాలకులు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వే

16 నెలలైనా విడుదలకాని ఇళ్ల బిల్లుల నిధులు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పక్కా ఇళ్ల బిల్లుల బకాయిల కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లకు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి బిల్లులు మంజూరుచేయలేదు. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారుల లెక్కల ప్రకారం నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో సుమారు పది కోట్ల రూపాయల మేర లబ్ధిదారులకు అందాల్సి వుంది.

సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదల కోసం 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షల చొప్పున మంజూరు చేసింది. లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోపాటు అదనంగా కొంతమేర సొంత సొమ్ము ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసినవారికి బిల్లులు మంజూరయ్యాయి. అయితే 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత పూర్తయిన ఇళ్లకు, వివిధ దశల్లో వున్న ఇళ్లకు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు కాలేదు. అప్పటి వరకు పూర్తిచేసిన ఇళ్ల పనులకు బిల్లుల కోసం లబ్ధిదారులు హౌసింగ్‌ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగినా పట్టించుకోలేదు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు కొనసాగించలేదు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క లబ్ధిదారునికి కూడా బిల్లు కూడా ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బిల్లులు మంజూరుకాని వారి జాబితాలను రప్పించుకొని, ఇళ్ల నిర్మాణం ఎంతవరకు పూర్తయ్యిందో తెలుసుకోవడానికి 2024 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సర్వే చేయించింది. ఇళ్ల నిర్మాణం ఎంతవరకు పూర్తయ్యింది? బిల్లుల బకాయిలు ఎంత వున్నాయి? లబ్ధిదారులు ఇక్కడే వుంటున్నారా? లేకపోతే వలస పోయారా? తదితర వివరాలను అధికారులు సేకరించి అదే ఏడాది నవంబరులో ప్రభుత్వానికి పంపించారు. ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.

రూ.9.95 కోట్ల బకాయిలు

గృహ నిర్మాణ సంస్థ నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల మండలాల్లో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద అప్పట్లో 6,581 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 749 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. 3,404 మంది లబ్ధిదారులు శ్లాబ్‌ వరకు నిర్మించారు. లింటల్‌ స్థాయిలో 294 ఇళ్లు, పునాదుల స్థాయిలో 1,052 ఇళ్లు, పునాదులు తవ్వినవి 460 ఇళ్లు, అసలు పనులు మొదలు పెట్టన లబ్ధిదారులు 607 మంది వున్నట్టు సర్వేలో అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో పలువురు లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. అన్ని మండలాల్లో కలిపి రూ.9.95 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. రావికమతం మండలంలో రూ.2.24 కోట్లు, రోలుగుంటలో రూ.1.5 కోట్లు, మాడుగులలో రూ.2.73 కోట్లు, గొలుగొండలో రూ.1.49 కోట్లు, నర్సీపట్నంలో రూ.58.24 లక్షలు, నాతవరంలో రూ.1.39 కోట్లమేర బకాయిలు ఉన్నాయి. మాకవరపాలెం మండలంలో బకాయిలు లేనట్టు అధికారులు చెబుతున్నారు. బిల్లులు త్వరగా మంజూరు చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 01:08 AM