నిధులకు నిరీక్షణ
ABN , Publish Date - May 11 , 2026 | 12:46 AM
మండలంలో వివిధ రకాల సాగునీటి వనరులు ఏళ్ల తరబడి నిర్వహణ, అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో ఆయకట్టుకు సరిగా నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెరువులు, వివిధ ఆనకట్టలకు పనుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ‘జలధార- జలహారతి’ కార్యక్రమం కింద రూ.44 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఇవి కూడా గొలుసు కట్టుచెరువులకు సంబంధించి కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు పనులు చేయడానికి కేటాయించింది.
అధ్వానంగా సాగునీటి వనరులు
శిథిలావస్థలో ఆనకట్టలు, చెరువుల మదుములు
పొలాలకు నీరు అందక రైతుల ఇబ్బందులు
రూ.8 కోట్ల నిధులకు ప్రతిపాదనలు
రూ.44 లక్షలు మాత్రమే మంజూరు
గొలుగొండ, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో వివిధ రకాల సాగునీటి వనరులు ఏళ్ల తరబడి నిర్వహణ, అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో ఆయకట్టుకు సరిగా నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెరువులు, వివిధ ఆనకట్టలకు పనుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ‘జలధార- జలహారతి’ కార్యక్రమం కింద రూ.44 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఇవి కూడా గొలుసు కట్టుచెరువులకు సంబంధించి కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు పనులు చేయడానికి కేటాయించింది.
మండలంలో 119 సాగునీటి చెరువులు, 13 ఆనకట్టలు వున్నాయి. గతంలో 2016-17లో టీడీపీ హయాంలో నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మదుములకు గేట్లు ఏర్పాటు చేశారు. తరువాత వైసీపీ ఐదేళ్ల పాలనలో వీటి నిర్వహణ.. అంటే పూడికతీత, తుప్పలు తొలగింపు, మదుములు, గేట్లకు మరమ్మతు పనులు ఒక్క ఏడాది కూడా చేపట్టలేదు. దీంతో సాగునీటి వనరుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మదుముల గేట్లు పాడైపోవడంతో నీరు వృథాగా పోయి, పంట చివర దశలో నీటి కొరత ఏర్పడుతున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని పలు మండలాల్లో సాగునీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం కింద పూడికతీత, తుప్పల తొలగింపు పనులు జరుగుతున్నాయి. కానీ గొలుగొండ మండలానికి నిధులు కేటాయించలేదు. మండలంలో వివిధ రకాల సాగునీటి వనరుల నిర్వహణ, మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.8 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ‘జలధార- జలహారతి’ కార్యక్రమం కింద గొలుసు కట్టుచెరువులకు సంబంధించి కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు పనులు చేయడానికి రూ.44 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఇ
నీరు నిలవని ధారగెడ్డ ఆనకట్ట
మండలంలోని పాతమల్లంపేటలో ధారగెడ్డ ఆనకట్ట, దానికి అనుసంధానంగా వున్న చెరువుల కింద సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఆనకట్ట దెబ్బతినడం, గేట్లు పాడైపోవడం, చెరువుల మదుములు మరమ్మతుకు గురవడంతో ఎగువ నుంచి వచ్చే వర్షం నీరు వచ్చింది వచ్చినట్టు దిగువకు వృథాగా పోతున్నది. దీనివల్ల వరి పంట పొట్ట దశలో నీరు అందుబాటులో లేక దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై జలవనరుల శాఖ ఏఈ రవికిరణ్‌ను వివరణ కోరగా.. ధారగెడ్డ ఆనకట్టకు నిధులు మంజూరు కాలేదని, గొలుసుకట్టు చెరువులకు మాత్రమే రూ.44 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.